దేవర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేసిన తారక్.. ప్రీ రిలీజ్ వేడుక రద్దు కావడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఈ రోజు దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ కావడం చాలా బాధాకరం. ముఖ్యంగా నాకు చాలా బాధగా ఉంది. అవకాశం దొరికినప్పుడల్లా మీతో గడపాలి అనుకుంటా. దేవర మూవీ గురించి మేం పడిన కష్టం మీకు ఇవాళ వివరిద్దామని చాలా ఎగ్జాట్ అయ్యా.
కానీ సెక్యూరిటీ రీజన్స్‌తో ఈవెంట్ క్యాన్సిల్ చెయ్యాల్సి వచ్చింది. ఇది ప్రొడ్యూసర్స్, ఈవెంట్ ఆర్గనైజర్స్ పొరపాటు కాదు.. వారిని బ్లేమ్ చెయ్యకండి. ఈ రోజు మనం కలవలేకపోయినా.. సెప్టెంబర్ 27వ తేదీ మనమందరం కలవబోతున్నాం. దేవర చిత్రం మీరందరూ చూడబోతున్నారు. కొరటాల శివ ఎంతో కష్టపడి దేవర తీశారు.. మరోసారి మీరు కాలర్ ఎగరేసుకునేలా చేస్తా. మీ ఆశీర్వాదం నాకు ఎప్పుడూ ఉండాలి. మీ ప్రేమ అభిమానాలకు అజన్మాంతం రుణపడి ఉంటా’’ అని ఎన్టీఆర్ పేర్కొన్నారు.
కాగా, ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన దేవర చిత్రం ఈ నెల 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మూవీ యూనిట్ ఏర్పాట్లు చేసింది. అయితే, పరిమితికి మించి ఎన్టీఆర్ అభిమానులు ప్రీ రిలీజ్ వేడుకకు రావడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి అదుపు తప్పేలా ఉండటంతో పోలీసుల సూచన మేరకు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మూవీ యూనిట్ రద్దు చేసింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర నిరాశకు గురి అయ్యారు.