- ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టే వ్యూహం ప్లాప్
- గతంలో మార్కెట్ చైర్ పర్సన్, ఇప్పుడు స్టాచ్యూ వివాదం
- పొలిటికల్ టర్న్ తో మంత్రి పువ్వాడ ఇరకాటం
- మార్పులు చేస్తున్నా.. జరగాల్సిన నష్టం జరిగిపాయె
ఖమ్మం, వెలుగు : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరకొస్తున్న టైమ్‌లో మంత్రి పువ్వాడ అజయ్‌కు ఎన్టీఆర్ విగ్రహ వివాదం తలనొప్పిగా మారింది. వారం, పది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఈ విగ్రహ ఏర్పాటుపై చర్చ నడుస్తుండగా, యాదవ సంఘాలు హైకోర్టు నుంచి స్టే తీసుకురావడంతో మరింత ప్రచారమైంది. యాదవ సంఘాలు అభ్యంతరం చెబుతుండగా, కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొందరు ప్రతినిధులు, విగ్రహ ఏర్పాటు నిర్వహణ కమిటీ వివరణలిస్తుండడంతో స్టాచ్యూ ఇష్యూ ఆసక్తికరంగా మారింది. శ్రీకృష్ణుడి అవతారంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని తయారు చేసి తమ మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ యాదవ సంఘాలు చేస్తున్న అభ్యంతరాలపై ఖమ్మంలోని పొలిటికల్ సర్కిళ్లలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టాలనే వ్యూహంలో భాగంగానే ఎన్టీఆర్ గెటప్ ను శ్రీకృష్ణుడి అవతారంలో ఉండే విధంగా ప్లాన్ చేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఊహించని విధంగా యాదవ సంఘాలు ఎంట్రీ ఇవ్వడం, ఇస్కాన్ జోక్యం చేసుకోవడం, హైకోర్టులో 16 రిట్ పిటిషన్లు దాఖలు కావడంతో సీన్ రివర్స్ అయింది. డ్యామేజీ కంట్రోల్లో భాగంగా విగ్రహంలో కొన్ని మార్పులు, చేర్పులు చేస్తున్నా ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
మార్కెట్ చైర్పర్సన్ విషయంలోనూ..
ఈ ఏడాది జనవరి చివరి వారంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ గా కార్పొరేటర్ దోరేపల్లి శ్వేత నియమితులయ్యారు. ఆమె ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వారు కాగా, ఆమె భర్త వైశ్య కమ్యూనిటీకి చెందినవారు. ఒక పదవి ఇవ్వడం ద్వారా అటు ఆర్యవైశ్య సామాజకవర్గాన్ని, ఇటు ముదిరాజ్‌లను సంతృప్తి పరచవచ్చనే వ్యూహంలో భాగంగానే ఆమెను ఎంపిక చేశారని ప్రచారం జరిగింది. దోరేపల్లి శ్వేత ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి అజయ్ మాట్లాడుతూ జనరల్ కేటగిరీలో భాగంగానే శ్వేతకు పదవి దక్కిందని, ఈ పదవితో అటు ముదిరాజ్‌లకు, ఇటు వైశ్యులకు న్యాయం చేసినట్టు అయ్యిందన్నారు. దీనిపై అదే వేదికపై ఉన్న ఆర్యవైశ్య సంఘం నేతలు సీరియస్‌గా స్పందించారు. తమ సామాజిక వర్గానికి పదవులు ఇచ్చినా, ఇవ్వకపోయినా పర్లేదు కానీ, ఇలాంటి మాటలతో తమను నొప్పించవద్దంటూ కామెంట్ చేశారు. దీంతో అప్పటి వరకు కూల్ గా జరుగుతున్న ప్రమాణ స్వీకార కార్యక్రమం కాస్తా ఈ వ్యాఖ్యలతో వేడెక్కింది. అప్పుడు, ఇప్పుడు .. రెండు సందర్భాల్లోనూ వ్యూహం పారకపోవడంతో మంత్రి అజయ్ ప్లాన్ వర్క్‌వుట్ కాలేదని పొలిటికల్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.
స్టాచ్యూ ఇష్యూ..పొలిటికల్ టర్న్
పది రోజులుగా విగ్రహ ఏర్పాటుకు అనుకూల, ప్రతికూల వర్గాల ఆరోపణల నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం కొంత పొలిటికల్ టర్న్ తీసుకుంది. కేవలం ఓట్ల కోణంలోనే స్టాచ్యూ ప్లాన్ చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా మంత్రి అజయ్ టార్గెట్గా ప్రత్యర్థులు దీన్ని ప్రచారంలోకి తీసుకొస్తున్నారు. నియోజకవర్గంలో కమ్మ ఓటర్లు 45 వేల వరకు ఉంటే, యాదవ ఓటర్లు 50 వేలకు పైగా ఉన్నారని ఒక అంచనా. గతంలో తెలుగుదేశం పార్టీని ఓన్ చేసుకున్న చాలా మంది కమ్మ ఓటర్లు, ఆ తర్వాత టీడీపీ ప్రభావం తగ్గిపోవడంతో పార్టీల వారీగా చీలిపోయారు. వాళ్లందరినీ మంత్రి అజయ్ కు అనుకూలంగా మార్చే ప్రయత్నాల్లో భాగంగా కొందరు అదే సామాజికవర్గానికి చెందిన లీడర్లు, ఎన్నారైలు, తానా ప్రతినిధుల సపోర్టుతో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు ప్లాన్ చేశారని తెలుస్తోంది. శ్రీకృష్ణుడి రూపంలో రాజమండ్రితో పాటు కొన్ని ప్రాంతాల్లో ఎన్టీఆర్ విగ్రహాలు ఉండడంతో, దానవీర శూరకర్ణ సినిమాలోని శ్రీకృష్ణుడి గెటప్ ఫైనల్ చేశారు. అయితే ఈ గెటప్ వెనుక యాదవులను కూడా శాటిస్ఫై చేసే వ్యూహం ఉందనేది అజయ్ ప్రత్యర్థుల వాదన. ఒకే విగ్రహ ఏర్పాటు ద్వారా అటు కమ్మ ఓటర్లను, ఇటు యాదవ కమ్యూనిటీని గ్రిప్‌లోకి తీసుకోవచ్చన్న ప్లాన్ ప్రస్తుతం బూమరాంగ్ అయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.