- పిటిషన్ డిస్మిస్.. దర్యాప్తు కొనసాగించవచ్చని పోలీసులకు సూచన
హైదరాబాద్, వెలుగు: జర్నలిస్ట్‌పై దాడి కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని సినీ నటుడు మోహన్ బాబు దాఖలు చేసిన పిటిషన్ నుహైకోర్టు డిస్మిస్ చేసింది. పోలీసులు నమోదు చేసిన కేసులో అభియోగాలు తీవ్రమైనందున ముందస్తు బెయిల్ ఇవ్వలేమని పిటిషన్‌ను కొట్టివేస్తూ జస్టిస్ కె లక్ష్మణ్ సోమవారం తీర్పు చెప్పారు. మోహన్ బాబు తరఫు సీనియర్ లాయర్ ఎల్ రవిచందర్ జోక్యం చేసుకొని.. కింది కోర్టులో రెగ్యులర్ బెయిలు పిటిషన్ దాఖలు చేసుకుంటామని, దాఖలు చేసిన రోజునే దానిపై విచారణ పూర్తి చేసి ఉత్తర్వులు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
ఈ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. పిటిషన్ వేసిన రోజునే విచారణ చేపట్టి నిర్ణయం వెలువరించాలని సుప్రీంకోర్టు తీర్పు ఏదైనా ఉందా? ఏమైనా చట్టం ఉందా?అని ప్రశ్నించింది. కింది కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తరువాత ప్రాసిక్యూషన్ కౌంటరు దాఖలు చేయాలని, ఆపై వాదనలు వినాలని, ఇవన్నీ ఒక్కరోజులోనే ఎలా సాధ్యమని ప్రశ్నించింది. అలాంటి ఒత్తిడి కింది కోర్టుపై పెడుతూ ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. సాధారణ పద్ధతిలో బెయిలు పిటిషన్ దాఖలు చేసుకుని చట్ట ప్రకారం తగిన ఉత్తర్వులు పొందాలని తేల్చి చెప్పింది.
మోహన్ బాబు దుబాయి పారిపోయారనే అభియోగాల నేపథ్యంలో ఆయన తరఫు లాయర్ కల్పించుకుని.. మోహన్‌బాబు తన మనుమడిని చూడానికి దుబాయ్ వెళ్లివచ్చారని.. ప్రస్తుతం తిరుపతిలో తన విద్యాసంస్థల నిర్వహణలో ఉన్నారని చెప్పారు. మోహన్ బాబు చేసిన దాడిలో జర్నలిస్ట్‌కు తీవ్రగాయమైందని, మెడికల్ రికార్డును పరిశీలించిన తరువాత ఫిర్యాదుదారు నుంచి మరోసారి వాంగ్మూలం తీసుకుని హత్యాయత్నం కేసు నమోదు చేశామని అదనపు పీపీ జితేందర్ రావు వీరమల్ల వాదించారు. ఈ వాదనతో జడ్జి ఏకీభవించారు. చట్ట ప్రకారం దర్యాప్తు కొనసాగించవచ్చని పోలీసులకు సూచించారు.