ఇండో–పాక్ మధ్య మళ్లీ యుద్ధం మాట!

 

ఇండో–పాకిస్థాన్​ ఒకే తానులోని రెండు ముక్కలు. కానీ, ఎప్పుడూ రెండింటి మధ్య ఉప్పు–నిప్పు వాతావరణమే. ఏమాత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా ప్రపంచం అంతా టెన్షన్​తో వణుకుతుంది. ఎందుకంటే, ఇవి అణ్వస్త్ర దేశాలుగా గుర్తింపు పొందని న్యూక్​ కంట్రీస్​. ఇండియా, పాకిస్థాన్​లు దాదాపు 300 న్యూక్లియర్ వెపన్స్​తో ఉన్నాయి. ఇండియా కంటే పాకిస్థాన్​ దగ్గర ఓ పది ఎక్కువే ఉన్నాయి. ఇండియా సహజంగా శాంతికాముక దేశం. ఏ దేశంతోనూ గొడవ పడాలని కోరుకోదు. ఈ వాస్తవాన్ని గుర్తించకుండా ఇండియా మీద కాలుదువ్వడానికే పాకిస్థాన్​ ప్రభుత్వాలు ఫోకస్ చేస్తుంటాయి. అక్కడి ప్రజల అవసరాలు, మౌలిక సదుపాయాల కంటే మిలిటరీ బడ్జెట్​కు పెద్ద మొత్తం కేటాయిస్తుంటాయి పాకిస్థాన్ ప్రభుత్వాలు. 1993–2006 మధ్య కాలంలో పాకిస్థాన్​ ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కంటే సైనిక అవసరాలపైనే ఎక్కువ ఖర్చు పెట్టాయని ‘స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్’ తేల్చి చెప్పింది. ప్రభుత్వ ఖర్చులో 20 శాతానికి మించి  మిలటరీకే ఖర్చు పెట్టాయని ఈ సంస్థ చెప్పింది. పాకిస్తాన్ డిఫెన్స్ అవసరాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. కేవలం ఇండియాపట్ల లేనిపోని భయంతో మిలటరీ వ్యవహారాలకు బడ్జెట్​లో పెద్ద వాటా వేసినట్లు గుర్తించింది.

నువ్వా నేనా అనే తీరులో సైనిక సామర్థ్యం

ఇండియా, పాకిస్థాన్ దగ్గర మిస్సైల్స్, న్యూక్లియర్ వెపన్స్ అటూ ఇటూగా సమాన సంఖ్యలో ఉన్నాయి. అగ్ని–3 సహా మొత్తం తొమ్మిది రకాల ఆపరేషనల్ మిస్సైల్స్​ ఇండియా దగ్గరున్నాయి. వీటిలో నేలపై నుంచి ప్రయోగించగల అగ్ని–3 బాలిస్టిక్ మిస్సైల్ చాలా ముఖ్యమైంది. 3,000 కిలోమీటర్ల నుంచి 5,000 కిలోమీటర్ల రేంజ్ వరకు ఈ మిస్సైల్ కొట్టగలదు. రష్యాతో కలిసి రూపొందించిన బ్రహ్మోస్ క్రూయిజ్ మిస్సైల్ మన ఆర్మీకి ప్లస్ పాయింట్​గా భావించవచ్చు. నేల, నింగి, నీళ్ల పైనుంచి (ట్రియాడ్​ పద్ధతిలో) ఈ బ్రహ్మోస్ మిస్సైల్​ని ప్రయోగించవచ్చు. వీటితో పాటు 6,000 టన్నుల అరిహంత్ బాలిస్టిక్  మిస్సైల్ ఉంది.

ఏ దైర్యం మాట్లాడిస్తోందో…!

వాలి చేతుల్లో సుగ్రీవుడు చావు దెబ్బలు తిని పారిపోయాక… మళ్లీ కొద్దిసేపటికే యుద్ధానికి రమ్మని అన్నను సవాల్​ చేస్తాడు. వాలి కోపంతో వెళ్లబోతే తార వారిస్తుంది. ‘ఇంతకు ముందే చావును తప్పించుకున్నవాడు, ఏ ధైర్యంతో మళ్లీ వచ్చాడో? అతని వెనక ఏ శక్తి పనిచేస్తోందో?’ అని అనుమానిస్తుంది. అచ్చంగా అలాంటి వ్యవహారమే పాకిస్థాన్​ది. ఇప్పటివరకు జరిగిన ఏ యుద్ధంలోనూ పాకిస్థాన్​ గెలవలేదు. కయ్యానికి కాలుదువ్విన ప్రతిసారీ చావు దెబ్బ తిని పీస్​ అగ్రిమెంట్​ చేసుకోవలసి వచ్చింది. మరోపక్కన ప్రపంచంలో ఎక్కడా పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​కి సపోర్టు లేదు. అయినా సరే, ఇండియాతో యుద్ధం గురించి పాకిస్థాన్​ ప్రధానమంత్రి మాట్లాడుతున్నాడంటే అనుమానించాల్సిందే.