భారత అణు కార్యక్రమాలు

భారత అణు కార్యక్రమాలు

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చే సమయానికే అమెరికా అణుబాంబులను తయారు చేసి ప్రయోగించింది. పి–5 దేశాల్లో (అమెరికా, రష్యా, ఫ్రాన్స్​, చైనా, బ్రిటన్​) అమెరికానే మొదటిసారి అణ్వస్త్ర ప్రయోగం చేసింది. భారత్​ విషయానికి వచ్చేసరికి తొలి ప్రధాని  నెహ్రూ న్యూక్లియర్​ విజ్ఞానం విధ్వంసం సృష్టించడానికి కాకుండా ప్రజా ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. ప్రధాని లాల్​ బహదూర్ శాస్త్రి సైతం ఇదే విధానానికి కట్టుబడి ఉన్నారు. భారత్​ అణ్వాయుధాలను సమకూర్చుకోవాలని ఎన్ని ఒత్తిడులు వచ్చినా వాటిని అధిగమించారే గానీ అణు పరిజ్ఞానం విధ్వంసక శక్తిగా మార్చడానికి అంగీకరించలేదు.  

ఇందిరాగాంధీ, వాజ్ పేయి ప్రభుత్వాలు ఇందుకు భిన్నంగా వ్యవహరించాయి. భారతదేశాన్ని అణ్వస్త్ర దేశంగా మార్చాయి. ఈ క్రమంలో భారతదేశాన్ని నిరోధించడానికి యూఎన్​ఓ మూడు ఒప్పందాలను తీసుకువచ్చింది. ఇందులో పీటీబీటీపై సంతకం చేసిన భారత్​, వివక్షతో కూడుకున్న న్యూక్లియర్​ నాన్​ ప్రొలిఫరేషన్​ ట్రీటీ, సమగ్ర అణ్వస్త్ర నిషేధ ఒప్పందాలపై మాత్రం సంతకాలు చేయలేదు.  

పాక్షిక పరీక్ష నిషేధ ఒప్పందం (పీటీబీటీ) 

ఈ ఒప్పందంపై 1963, ఆగస్టు 5న  రష్యా రాజధాని మాస్కోలో అమెరికా, ఆనాటి సోవియట్​యూనియన్​, యునైటెడ్​ కింగ్​డమ్​ సంతకాలు చేశాయి. దీనిని లిమిటెడ్​ టెస్ట్​ బ్యాన్​ ట్రీటీ(ఎల్​టీబీటీ) అని కూడా అంటారు. ఈ ఒప్పందం 1963, అక్టోబర్​ 10 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ఆకాశంలో గానీ అంతర జలాల్లో గానీ అణు పరీక్షలు నిర్వహించరాదు. భూ అంతర్భాగంలో మాత్రమే నిర్వహించవచ్చు. పాక్షిక పరీక్ష నిషేధ ఒప్పందంపై 1963లోనే భారత్​ సంతకం చేయడంతోపాటు ధ్రువీకరణ కూడా చేసుకుంది. 

సమగ్ర అణ్వస్త్ర  నిషేధ ఒప్పందం (సీటీబీటీ)

ఈ ఒప్పందాన్ని  ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో 1996, సెప్టెంబర్ 10న ఆమోదం కోసం ప్రతిపాదించారు. ఆ సమయంలో 71 దేశాలు అంగీకారం తెలిపాయి. 2023, మార్చి నాటికి 186 దేశాలు సంతకాలు చేశాయి. కానీ, 177 దేశాలు రాటిఫై చేసుకున్నాయి. ఇటీవల సోలమన్​ దీవులు 2023, జనవరి 20న సీటీబీటీ ఒప్పందాన్ని ఆమోదించాయి. భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలైన బ్రిటన్​, రష్యా, ఫ్రాన్స్​, అమెరికా, చైనాలు సైతం సంతకాలు చేశాయి. సీటీబీటీలో 17 ప్రకరణలు, ఒక ప్రోటోకాల్​ ఉన్నాయి. 

ఈ ఒప్పందం అన్ని రకాల అణుశక్తి ప్రయోగాలను వ్యతిరేకిస్తుంది. అయితే, ఈ ఒప్పందం రెట్టింపు వివక్షతతో కూడుకున్నదిగా పేర్కొంటూ భారత్​తోపాటు పాకిస్తాన్, ఇజ్రాయెల్​, ఉత్తరకొరియా సంతకం చేయలేదు. 

సీటీబీటీలోని ప్రధానాంశాలు 

ప్రతి దేశం అణ్వాయుధ ప్రయోగాలు, తయారీ, అణు విధ్వంసాలను పూర్తిగా నిలిపివేయాలి. ఏ దేశం, ఇతర దేశాలు అణ్వాయుధాలను, అణు సామగ్రిని కలిగి ఉండటానికి ప్రోత్సహించరాదు. ఐదు అగ్రరాజ్యాలు అణ్వాయుధాల తయారీకి అణ్వాయుధ సామగ్రిని కాని, అణ్వాయుధాలను కాని ఎగుమతి చేయరాదు. 

భారత్​ దృక్పథం

సీటీబీటీ ఒప్పందాన్ని  రెట్టింపు వివక్షతతో కూడుకున్నదిగా భారత్​ పేర్కొంది. అగ్రరాజ్యాలు మాత్రమే అణ్వాయుధాలు కలిగి ఉండాలి, మిగిలిన దేశాలు ప్రయోగాలు సైతం చేయకూడదని ఒప్పందంలో పేర్కొనడంతో భారత్​ దీనిని అంగీకరించలేదు. మొదట వినియోగించరాదు అనే నియమాన్ని  ఎప్పుడో నిర్ణయించుకుంది. ఇతర దేశాలు ప్రయోగించకుండా భారత్​ అణ్వాయుధాలను ప్రయో గించదు. భారత్​ ఒక్కటే రెండు అణుశక్తి గల దేశాల మధ్యలో ఉంది. పొరుగు దేశాలైన చైనా, పాకిస్తాన్​ రెండూ అణ్వాయుధ శక్తిని కలిగి ఉన్నాయి. ఈ రెండు దేశాలూ గతంలో భారత్​పై దాడికి దిగాయి. అలాంటి పరిస్థితుల్లో భారత్​ అణుశక్తిని కలిగి ఉండటం తప్పనిసరి.

న్యూక్లియర్​ నాన్​ ప్రొలిఫరేషన్​ ట్రీటీ 

ఈ ఒప్పందాన్ని 1968, జులై 1న ఆమోదం కోసం ప్రతిపాదించారు. న్యూక్లియర్​ నాన్​ ప్రొలిఫరేషన్​ ట్రీటీ 1970, మార్చి 5 నుంచి అమలులోకి వచ్చింది. న్యూక్లియర్​ నాన్​ ప్రొలిఫరేషన్​ ట్రీటీపై తొలి సంతకం ఫిన్​లాండ్​ చేసింది. ఈ ఒప్పందంలో ప్రస్తుతం 191 దేశాలు ఉన్నాయి. దీని ద్వారా ఫ్రాన్స్, చైనా, సోవియట్​ యూనియన్​, బ్రిటన్​, అమెరికా మాత్రమే అణ్వాయుధాలను కలిగి ఉండాలని, మిగతా దేశాలు అణ్వాయుధ ప్రయోగాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. వివక్షతతో కూడుకున్న ఈ ఒప్పందంపై ఎప్పటికీ సంతకం చేయనని భారత్ స్పష్టం చేసింది. న్యూక్లియర్​ నాన్​ ప్రొలిఫరేషన్​ ట్రీటీపై భారత్​, పాకిస్తాన్​, ఇజ్రాయెల్​, ఉత్తరకొరియా దేశాలు ఇప్పటికీ సంతకాలు చేయలేదు. ఈ ఒప్పందం నుంచి ఉత్తరకొరియా 2003లోనే వైదొలిగింది. 

ఎన్​టీపీలో ముఖ్యాంశాలు

 న్యూక్లియర్​ నాన్​ ప్రొలిఫరేషన్​ ట్రీటీలో పేర్కొన్న ఐదు దేశాలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా గానీ అణ్వాయుధాలను, అణ్వాయుధ సామగ్రిని, ఇతర అణుశక్తి కాని దేశాలకు సరఫరా చేయకూడదు. అణుశక్తి కాని దేశాలను అణ్వాయుధాలను తయారు చేయడానికి ప్రోత్సహించరాదు. అణుశక్తి కాని దేశాలు అణ్వాయుధాలను కాని, సామగ్రిని ఎప్పటికీ దిగుమతి చేసుకోరాదు. అణుశక్తి కాని దేశాలు ఎప్పటికీ అణ్వాయుధాలను ప్రయోగించరాదు. కలిగి ఉండకూడదు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక్కసారి ఎన్​పీటీ ఒప్పందంపై పున: సమీక్ష నిర్వహిస్తారు. 25 సంవత్సరాల తర్వాత ఈ ఒప్పందాన్ని కొనసాగించాలా లేదా అనేది నిర్ణయిస్తారు. 

ఇందిరాగాంధీ కాలం

1967లో చైనా హైడ్రోజన్​ బాంబును పరీక్షించింది. ఇందిరాగాంధీ పాలనా కాలంలో 1971లో పాకిస్తాన్​తో భారత్​ యుద్ధం చేయాల్సి వచ్చింది. ఈ యుద్ధ సమయంలో పాకిస్తాన్​ వైపు అమెరికా నిలిచింది. ఈ యుద్ధంలో భారత్​ విజయం సాధించినా భవిష్యత్తులో అమెరికా తదితర అణ్వస్త్ర దేశాలను ఎదుర్కోవడానికి అణ్వాయుధాలను తయారు చేయాల్సిన ఆవశ్యకతను గుర్తించింది. మొదటిసారిగా ఇందిరాగాంధీ భారతదేశంలో అణ్వాయుధాలను తయారు చేయడానికి సారథ్యం వహించింది. 1974, మే 18న పోక్రాన్​–1 బుద్ధుడు నవ్వాడు అనే పేరుతో రాజస్థాన్​లో మొదటిసారి అణుపరీక్షలు నిర్వహించారు. దీంతో భారత్​లో అణ్వాయుధ శకం ప్రారంభమైంది. ఈ ప్రయోగంతో యూఎన్​ఓలోని ఐదు దేశాలు మినహాయించి మిగిలిన దేశాల్లో మొదటిసారిగా అణుబాంబు ప్రయోగం నిర్వహించిన దేశంగా భారత్​ నిలిచింది. ఆ తర్వాత 1968లో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం యూఎన్​ఓలో తీసుకురాగా భారత్ సంతకం చేయడానికి 
నిరాకరించింది.

వాజ్​పేయి కాలం 

1998 వ సంవత్సరం భారత అణ్వస్త్ర శకంలో ఒక గొప్ప సంవత్సరం. ఈ ఏడాదిలో ప్రధానంగా మూడు అంశాలు ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. అవి.. 1. పోక్రాన్​–2 ప్రయోగం, భారత్​ అణు విధాన ప్రకటన (న్యూక్లియర్ డాక్ట్రిన్​), 3. సీటీబీటీ ఒప్పందం. 1998, మేలో అటల్​ బిహారి వాజ్​పేయి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు పోక్రాన్​–2ను భారత్​ నిర్వహించింది. ఈ ప్రయోగంలో ఐదు అణుబాంబులను రూపొందించారు. పోక్రాన్​–2 ప్రయోగంతో భారతదేశం సంపూర్ణ అణ్వాయుధ దేశంగా ప్రకటించుకుంది. 1998లో భారతదేశ ప్రధాన మంత్రిగా అటల్​ బిహారి వాజ్​పేయి  అధికారంలో ఉన్నప్పుడు సీటీబీటీ ఒప్పందాన్ని ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించగా భారత్​ సంతకం చేయడానికి నిరాకరించింది.