
సైబర్ నేరగాళ్లు బరితెగించారు. డబ్బుల కోసం ఎమ్మెల్యేకే న్యూడ్ చేసి బెదిరించడం కలకలం రేపింది. స్క్రీన్ రికార్డ్ చేసి ఎమ్మెల్యేకే వీడియో పంపడం.. స్పందించక పోవడంతో అదే వీడియోను కార్యకర్తలకు పంపించడం నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించింది.
వివరాల్లోకి వెళ్తే.. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశానికి ఒక వీడియో కాల్ వచ్చింది. అనుచరులతో మాట్లాడుతుండగా ఫోన్ రావడంతో లిఫ్ట్ చేయగా అది న్యూడ్ కాల్ అని అర్థం అయ్యింది. దీంతో వెంటనే కాల్ కట్ చేసినా.. అప్పటికే స్క్రీన్ రికార్డ్ చేసిన సైబర్ క్రిమినల్స్.. అదే వీడియోను ఆయనకే పంపించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో షాక్ కు గురయ్యారు ఎమ్మెల్యే వీరేశం.
సైబర్ నేరగాళ్ల డిమాండ్ కు ఎమ్మెల్యే స్పందించకపోవడంతో బెదిరింపులకు దిగారు. ‘‘వీడియో కాంగ్రెస్ లీడర్లందరికీ పంపిస్తాం.. మీ ఇష్టం..’’ అంటూ ఎమ్మెల్యేనే హెచ్చరించారు. అంతే కాకుండా ‘‘ఇది మీ జీవితంతో ముడిపడి ఉన్న అంశం’’ అంటూ బెదిరింపులకు దిగారు. ఎమ్మెల్యే వీరేశం నుంచి రిప్లై రాకపోవడంతో పలువురు అభిమానులు, అనుచరులకు రికార్డ్ చేసిన వీడియో పంపించారు నేరగాళ్లు.
Also Read:-గోల్డ్ క్రెడిట్ లోన్ స్కీం పేరుతో రూ.549 కోట్ల మోసం..
ఎమ్మెల్యే స్పందించకపోవడంతో అదే వీడియోను నియోజకవర్గంలోని అభిమానులకు ఫార్వార్డ్ చేశారు కేటుగాళ్లు. దీంతో తమకు ఇలాంటి వీడియోలు వచ్చాయని అభిమానులు ఫోన్ చేయడంతో ఎమ్మెల్యే వీరేశం కంగుతిన్నారు. ఈ వ్యవహారంలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే వీరేశం.
సైబర్ నేరగాళ్లనుంచి ప్రజాప్రతినిధులు, అధికారులకు న్యూడ్ కాల్స్ రావడం ఇదే మొదటి సారి కాదు. గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్యే కూడా ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. అదేవిధంగా గతంలో ఏపీ హైకోర్టు మెంబర్ కు కూడా ఇలాంటి ఘటన ఎదురైంది. న్యూడ్ కాల్ చేసి ఆ తర్వాత రూ.25 వేల ఇస్తే సరి లేదంటే వైరల్ చేస్తామని బెదిరించడం ఆ మధ్య సంచలన సృష్టించింది. డబ్బుల కోసం సైబర్ నేరగాళ్లు కామన్ మ్యాన్ నుంచి ఎమ్మెల్యేల వరకు ఎవరినీ వదలటం లేదు. తాజాగా నకిరేకల్ ఎమ్మెల్యేకు ఈ చేదు అనుభవం కలగడం సంచలన సృష్టిస్తోంది.