హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. నుమాయిష్ షురూ అయ్యింది

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. నుమాయిష్ షురూ అయ్యింది

ఏటా జనవరిలో హైదరాబాద్ మహానగరంలో నిర్వహించే నుమాయిష్ ప్రారంభమయ్యింది..శుక్రవారం (జనవరి 3, 2025) సాయంత్రం 84 వ అల్ ఇండియా ఇండస్ట్రియల్  ఎగ్జిబిషన్ నుమాయిష్ ను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. నుమాయిష్ లో భాగంగా హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో దేశ, విదేశా లకు చెందిన ఉత్పత్తులతో  స్టాల్స్ ఏర్పాటుచేశారు. ప్రతి ఏటా జనవరి 1 తేదీన ప్రారంభమయ్యే  అంతర్జాతీయ మార్కెట్.. ఈసారి జనవరి 3న ప్రారంభమయ్యింది. 46 రోజుల పాటు నుమాయిష్ కొనసాగుతుంది. 

1938లో ప్రారంభమైన  నుమాయిష్.. ప్రతియేటా హైదరాబాద్ మహానగరంలో గ్రాండ్ గా నిర్వహించడం జరుగుతుంది.. కుటీర పరిశ్రమల్లో తయారైన వస్తువులతో సహా దేశ విదేశాలకు చెందిన అనేక వస్తువులు నుమాయిష్ లో అమ్మకానికి పెడతారు. ఈసారి దాదాపు 2వేల స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈసారి నుమాయిష్ కు 25 లక్షల మంది సందర్శకులు వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. 

నుమాయిష్ సందర్బంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసు బందోబస్తుతోపాటు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అగ్నిప్రమాదాల నివారణ కోసం లక్షన్నర లీటర్ల నీటి కెపాసిటీ తో రెండు నీటి సంపులను ఏర్పాటు చేశారు.82 ఫైర్ పాయింట్స్ ఏర్పాటు చేశారు. పోలీస్ నిఘా కోసం వాచింగ్ టవర్స్, సెల్ సింగ్నల్ కోసం ప్రత్యేక సెల్ టవర్స్ ఏర్పాటు చేశారు. 

ఓ  వైపు షాపింగ్,మరో వైపు ఎంజాయ్ మెంట్ ఒకే దగ్గర దొరకడంతో నాంపల్లి ఎగ్జిబిషన్ కు వెళ్లేందుకు ప్రజల ఆసక్తి చూపుతారు. నుమాయిష్ ఎంట్రీ  టికెట్ ధర  50 రూపాయలు. 5 ఏళ్ళ లోపు పిల్లలకు ఫ్రీ ఎంట్రీ  ఉండదు. జనవరి 7 వ తేదీ లేడీస్ డేగా జరుపుతారు. ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల 30  వరకు నుమాయిష్ సందర్శించవచ్చు.  వీక్ ఎండ్స్, హాలీ డేస్ లలో రాత్రి 11 వరకు నిర్వహిస్తారు. 

నుమాయిష్ సందర్బంగా ట్రాఫిక్ పోలీసులు గట్టి బందోబస్తు చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ కు వచ్చే వారికి ఫ్రీ పార్కింగ్ ఏర్పాటు చేశారు. మరోవైపు ఎగ్జిబిషన్ నేపథ్యంలో అర్ధ రాత్రి 12 గంటల వరకు మెట్రో రైలు  సేవలు అందుబాటులో ఉంటాయి.  

ప్రతియేటా నుమాయిష్ నిర్వహణతో వచ్చే ఆదాయంలో 20 విద్యాసంస్థలను నడిపిస్తున్నారు నిర్వాహకులు.. దాదాపు 30వేల మంది స్టూడెంట్స్ కు విద్య అందిస్తున్నారు.