జనవరి 3 నుంచి నుమాయిష్.. ఆదాయంతో 20 విద్యా సంస్థలకు స్పాన్సర్

జనవరి 3 నుంచి నుమాయిష్.. ఆదాయంతో 20 విద్యా సంస్థలకు స్పాన్సర్

ప్రతి ఏటా నాంపల్లోని గ్రౌండ్స్ లో జనవరి 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే నుమాయిష్ ఈ సారి 3కు వాయిదా పడింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై ప్రభుత్వం సంతాప దినాలను ప్రకటించినందు వలన వాయిదా వేసినట్లు ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వాహులు తెలిపారు. 

ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వహించే 84వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్, 2025 జనవరి 3 న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభిస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి తో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారని తెలిపారు. 

ఎగ్జిబిషన్ సొసైటీ 85 ఏళ్ల నాటి చరిత్ర గలదని, ఎగ్జిబిషన్ సొసైటీ  సిల్వర్ జూబ్లీ,  గోల్డెన్ జూబ్లీ,  డైమండ్ జూబ్లీ,  ప్లాటినం జూబ్లీ జరుపుకుందని తెలిపారు.  ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నుండి వచ్చే ఆదాయంతో తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాలలో ఉన్న 20 విద్యా సంస్థలను స్పాన్సర్ చేస్తున్నామని అన్నారు. ఎగ్జిబిషన్ నుండి వచ్చే ఆదాయం ద్వారా ప్రతి సంవత్సరం సుమారు 30 వేల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు.

ALSO READ | అల్లు అర్జున్ ఫ్యాన్స్పై చర్యలు తీసుకోండి: పోలీసులకు ఓయూ జేఏసీ ఫిర్యాదు

నుమాయిష్ ప్రదర్శన ద్వారా చిన్న మధ్య తరగతి వ్యాపారాలను ప్రోత్సహిస్తున్నామని.. ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు  ఇతర రాష్టాల నుంచి పెద్ద ఎత్తున ఈ నుమయిష్ లో స్టాల్స్ ఏర్పాటు చేస్తుంటారని, అన్ని డిపార్ట్మెంట్ కి సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రదర్శనలో 2వేలకు పైగా స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు.

ఈసారి ఎక్సబిషన్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని,  మినీ ట్రైన్ తో పాటు డబుల్ డెక్కర్ బస్ రైడ్ ఏర్పాటు చేస్తున్నామని నుమాయిష్ ట్రెజరర్ తెలిపారు. టీ హబ్ తో టై అప్ అయ్యామని.. Led స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రతి సంవత్సరం లాగే యశోద గ్రూప్స్  ఆధ్వర్యంలో మెడికల్ సెంటర్  ఏర్పాటు ఉంటుందని, ఫైర్ సేఫ్టీ కి సంబంధించి  అన్ని జాగ్రత్తలు పాటిస్తూ అందుబాటులో 2 ఫైర్ ఇంజన్స్, వాటర్, 100 సీసీ కెమెరాలు, సెక్యూరిటీ, వాలంటీర్స్ తో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 

ఎంట్రీ టికెట్ రేట్లు రూ.40 నుంచి 50కి పెంపు..

నుమాయిష్  ఎంట్రీ టికెట్ రేట్లను రూ.40 నుంచి రూ.50కు పెంచుతున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ సెక్రెటరీ సురేందర్ రెడ్డి తెలిపారు. ఈ సారి ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకునే సౌకర్యం కల్పిస్తామని అన్నారు.  సాధారణ రోజుల్లో సాయంత్రం 4 నుండి రాత్రి 10:30 ఉంటుందని.. శని, ఆదివారాల్లో రాత్రి 11 వరకు కొనసాగుతుందని తెలిపారు. గతంలో వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ MRP కి  మింగి అమ్మినట్లు తమ దృష్టికి వచ్చిందని,  ఈసారి అలా జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత సంవత్సరం 22 లక్షల మంది నుమయిష్ కి హాజరయ్యారని, ఈసారి మరో 5 లక్షలు పెరిగే అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలిపారు.