- ప్రభుత్వ స్కూళ్లు పెరుగుతున్నా చేరికలు తగ్గుముఖం
- ఏటా పెరుగుతున్న ప్రైవేటు స్టూడెంట్ల సంఖ్య
- ప్రైమరీలో మాత్రం సర్కారుదే హవా
హైదరాబాద్, వెలుగు: సర్కారు బడుల్లో ఏటా పిల్లల సంఖ్య తగ్గుతోంది. మరోపక్క ప్రైవేటు స్కూళ్లలో స్టూడెంట్ల సంఖ్య పెరుగుతోంది. సోమవారం అసెంబ్లీలో సర్కారు ఈ విషయం వెల్లడించింది. 2021–22 విద్యా సంవత్సరంలో మొత్తం 59,46,084 మంది విద్యార్థులు చదవగా, అందులో ప్రైవేటులో 28,67,895 మంది చదివారు. సర్కారు స్కూళ్లలో 30,78,189 మంది చదివారు.
ఆ తర్వాత సంవత్సరంలో ఈ లెక్కలు తారుమారు అయ్యాయి. 2022–23లో మొత్తం 58,98,686 మంది చదివారు. వారిలో సర్కారు స్కూళ్లలో 28,80,809 మంది, ప్రైవేటు బడుల్లో 30,17,877 చదివారు. అలాగే 2023–24 సంవత్సరంలోనూ ఇదే తీరు కొనసాగింది. నిరుడు మొత్తం 60,42,060 మంది చదివితే.. ప్రైవేటు బడుల్లో ఏకంగా 34,05,430 మంది విద్యను అభ్యసించారు. సర్కారు బడుల్లో పిల్లల సంఖ్య 26,36,630కి తగ్గిపోయింది. సర్కారు బడుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు 2021–22లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ‘మన ఊరు మన బడి’ స్కీమ్ తీసుకొచ్చింది. మూడు విడతల్లో మొత్తం స్కూళ్లలో వసతులు కల్పిస్తామని ప్రకటించింది. కానీ, ఫస్ట్ ఫేజ్ లో గుర్తించిన స్కూళ్లలో కనీసం నాలుగో వంతు బడుల్లోనూ పనులు పూర్తి చేయలేదు. స్కీమ్ బాగున్నా, దాని అమలు కోసం బీఆర్ఎస్ సర్కారు నిధులు ఇవ్వలేదు.
ప్రైమరీలో సర్కారులో ఎక్కువ చేరికలు
ప్రైమరీ లెవెల్ (ఒకటి నుంచి ఐదో తరగతి వరకు) అడ్మిషన్లలో మాత్రం సర్కారు విద్యా సంస్థల హవా కొనసాగుతోంది. 2021–22లో ప్రైవేటు బడుల్లో 54,449 మంది అడ్మిషన్లు పొందితే, సర్కారు బడుల్లో మాత్రం 11,19,949 మంది చదివారు. 2022–23లో సర్కారులో 9,64,128 మంది చదవగా, ప్రైవేటు స్కూళ్లలో 53,529 మంది మాత్రమే చదివారు. నిరుడు 2023–24లో ప్రభుత్వ బడుల్లో 8,15,505 మంది విద్యార్థులు, ప్రైవేటు స్కూళ్లలో 59,143 మంది అడ్మిషన్లు పొందారు.