![ఆటిజం పేరిట అడ్డగోలు దోపిడీ .. పేరెంట్స్ అవసరాన్ని క్యాష్ చేసుకుంటున్న నిర్వాహకులు](https://static.v6velugu.com/uploads/2025/02/number-of-children-suffering-from-autism-is-increasing-day-by-day-in-hyderabad_O1UXvBqEVH.jpg)
- ఒక్కో సెషన్‌కు వేలల్లో..ప్యాకేజీలకు లక్షల్లో వసూళ్లు
- అన్క్వాలిఫైడ్ స్టాఫ్‌తో ట్రీట్మెంట్
- ఏండ్ల తరబడి చికిత్స ఇచ్చినానో ఛేంజ్
- సర్కారు హాస్పిటళ్లకు తీసుకొస్తున్న తల్లిదండ్రులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో ఆటిజంతో బాధపడే పిల్లల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఈ సమస్య నుంచి పిల్లల్ని బయట పడేసేందుకు తల్లిదండ్రులు ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడడం లేదు. వారి అవసరాన్ని అవకాశంగా తీసుకొని కొన్ని ఆటిజంసెంటర్లు దోపిడీ చేస్తున్నాయి. అనుమతి లేకుండా గల్లీ గల్లీకో చైల్డ్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ లేకుండా, క్వాలిఫైడ్ డాక్టర్లను నియమించుకోకుండా నెలలు, సంవత్సరాలు ట్రీట్మెంట్ చేస్తూ ఆటిజం పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు.
ఏండ్ల తరబడి ట్రీట్మెంట్
ఆటిజంతో బాధపడుతున్న తమ పిల్లలను బాగు చేయాలని సెంటర్లకు వెళ్తున్న పేరెంట్స్ కు నిర్వాహకులు మాయమాటలు చెప్పి నమ్మిస్తున్నారు. సెషన్‌కు వేలల్లో, ఆరు నెలల ప్యాకేజీ, ఏడాది ప్యాకేజీలు అంటూ లక్షలు తీసుకుంటున్నారు. ముందు కొన్ని నెలల్లోనే తగ్గుతుందని చెప్పి. సంవత్సరాల తరబడి ట్రీట్మెంట్చేస్తున్నారు. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా పిల్లల మానసిక ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో... నిలోఫర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ఆఫ్మెంటల్ హెల్త్ సెంటర్ కు తీసుకుపోతున్నారు. ముఖ్యంగా నగరంలోని అమీర్‌పేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కూకట్ పల్లి, దిల్ సుఖ్‌నగర్, ఉప్పల్తదితర ప్రాంతాల్లో ఇలాంటి థెరపీ సెంటర్లు విచ్చలవిడిగా వెలిశాయి. సిటీ వ్యాప్తంగా దాదాపు150 ఆటిజం, చైల్డ్ డెవలప్ మెంట్ సెంటర్లుండగా, ఇందులో ఎక్కువ శాతం ఉన్నాయి.
అన్ క్వాలిఫైడ్ థెరపిస్టులు..
రూల్స్ప్రకారం.. ప్రతి ఆటిజం, చైల్డ్ డెవలప్ మెంట్ సెంటర్ లో క్వాలిఫైడ్ క్లినికల్ సైకాలజిస్ట్, రిహాబిలిటేషన్సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్, పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్, పీడియాట్రిక్ డాక్టర్ ఇన్‌చార్జీలుగా ఉండాలి, ఇన్ చార్జీల కింద స్పీచ్ అండ్ ఆడియో పాథాలజిస్టులు, బిహేవియర్థెరపిస్టులు, ఆక్యుపేషనల్థెరపిస్టులు ఉండాలి. మెజారిటీ సెంటర్లలో ఒక థెరపిస్టు కింద నలుగురైదుగురు అన్ క్వాలిఫైడ్ పర్సన్స్ కు ట్రైనింగ్ఇచ్చి థెరపీ ట్రీట్మెంట్చేయిస్తున్నారు. దీంతో పిల్లల ప్రవర్తనలో మార్పు రావడం లేదు. డాక్టర్ల సూచనల మేరకే ఆక్యుపేషనల్, స్పీచ్, బిహేవియర్ థెరపీ చేయాల్సి ఉండగా, ఎలాంటి అసెస్ మెంట్ చేయకుండా చికిత్స చేస్తున్నారు.
స్పీచ్, ఆక్యుపేషనల్ థెరపీలు వారానికి మూడు సార్లు మాత్రమే చేయాల్సి ఉండగా, వారానికి ఐదారు రోజులు సెషన్లు నిర్వహిస్తున్నారు. సెంటర్లలోనే కాకుండా తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువసార్లు ప్రాక్టీస్చేయిస్తేనే ప్రయోజనం ఉంటుంది. అలా చేయాలని థెరపీ సెంటర్లు పేరెంట్స్ కు సూచించాలి. కానీ, ఎక్కువ సెషన్లు నిర్వహిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయనే దురాశతో వారానికి ఆరు రోజులు థెరపీ సెషన్స్ తీసుకోవాలని పేరెంట్స్ ను బలవంత పెడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇలా జరుగుతోందని, ఇప్పటికైనా స్పందించి ఇల్లీగల్ థెరపీ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ప్రతి 36 మందిలో.. ఒకరికి సమస్య
వయస్సుకు తగ్గట్టు పిల్లల్లో మానసిక ఎదుగుదల రాకపోవడాన్ని ఆటిజం అంటారు. ప్రతి 36 మంది పిల్లల్లో ఒకరికి ఆటిజం ఉందంటే సమస్య తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆటిజాన్ని న్యూరోలాజికల్ డిజార్డర్ అని కూడా అంటారు. అలాగని దీనిని బుద్దిమాంధ్యం అని అనలేం. చిన్నప్పటి నుంచే ఆటిజం లక్షణాలను గుర్తించవచ్చు. కానీ, రెండేండ్ల తరువాతే నిర్ధారణకు వస్తారు. ఆటిజం ఉన్న పిల్లలు సాధారణంగా ఎవరితోనూ కలవరు. నేరుగా కండ్లలోకి చూడరు. పెద్ద పెద్ద సౌండ్స్ వచ్చినా , పిలిచినా పట్టించుకోకపోవడం, ఒంటరిగా ఆడుకోవడం, చేసిన పనులనే మళ్లీ మళ్లీ చేయడం, సమాధానం తెలిసినా వెంటనే చెప్పలేకపోడం, దెబ్బలు తగిలినా తెలియకపోవడం దీని లక్షణాలు.
నిజానికి ఆటిజానికి వంద శాతం చికిత్స లేదు. ఒకసారి ఆటిజం లక్షణాలు కనిపిస్తే.. అందులో ఏదో ఒకటి జీవితాంతం ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు. కానీ, బిహేవియర్ థెరపీ, అక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ, ఆహారపు అలవాట్లు, కొన్ని మందుల ద్వారా పిల్లల మానసిక ప్రవర్తనలో ఎక్కువశాతం మార్పు తీసుకురావచ్చని చెప్తున్నారు. దీనినే ఆసరాగా చేసుకొని ప్రైవేట్ థెరపీ సెంటర్లు దోచుకుంటున్నాయి.