భారత్ లో భారీగా పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య    

భారత్ లో భారీగా పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య    
  •    ఆగని కరోనా కల్లోలం..1,84,372 కొత్త కేసులు
  •     మహారాష్ట్రలోనే 60 వేల మందికిపైగా పాజిటివ్
  •     13 లక్షలు దాటిన యాక్టివ్ కేసులు..
  •     88.92 శాతానికి పడిపోయిన రికవరీ రేటు
  •     కొత్త కేసుల్లో 82 శాతం, డెత్స్​లో 86 శాతం 10 రాష్ట్రాల్లోనే

కరోనా కల్లోలం ఆగడం లేదు. సెకండ్ వేవ్​లో వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. డైలీ కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గత 24 గంటల వ్యవధిలో 1,84,372 కొత్త కేసులు నమోదయ్యాయి. 1,027 మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 1,38,73,825కు, మొత్తం డెత్స్ 1,72,085కి పెరిగాయని హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. యాక్టివ్ కేసుల సంఖ్య 13.65 లక్షలకు చేరిందని చెప్పింది. వరుసగా 35వ రోజూ యాక్టివ్ కేసుల సంఖ్య పెరిగింది. గత 24 గంటల వ్యవధిలో 82,339 మంది రికవర్ అయ్యారు. రికవరీ రేటు 88.92 శాతానికి పడిపోగా, యాక్టివ్ కేసులు 9.84 శాతానికి పెరిగాయి. 1,23,36,036 మంది ఇప్పటిదాకా కోలుకున్నారు. ఈ నెల 13 దాకా 26 కోట్ల టెస్టులు చేయగా..  మంగళవారం ఒక్కరోజే 14,11,758 శాంపిల్స్ పరీక్షించారు. రోజుకు 15 లక్షల టెస్టులు చేసేలా కెపాసిటీ పెంచుతున్నట్లు హెల్త్ మినిస్ట్రీ చెప్పింది.

మహారాష్ట్రలో 281 మంది..

మహారాష్ట్రలో ఒక్కరోజే 281 మరణాలు నమోదయ్యాయి. ఆ తర్వాత చత్తీస్​గఢ్​లో 156 మంది చనిపోయారు. మొత్తం డెత్స్ లోనూ మహారాష్ట్ర ముందుంది. 58,526 మంది అక్కడ చనిపోయారు. కర్నాటకలో 13 వేలు, తమిళనాడులో 12,945, ఢిల్లీలో 11,436, బెంగాల్​లో 10,434  డెత్స్ రికార్డయ్యాయి. ఇక దేశంలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో 82 శాతం మహారాష్ట్ర, యూపీ, చత్తీస్​గఢ్ సహా 10 రాష్ట్రాల్లోనే ఉంటున్నాయి. ఒక్క మహారాష్ట్రలోనే 60 వేలకు పైగా కొత్త కేసులు వచ్చాయి. యూపీలో 17,963, చత్తీస్​గఢ్​లో 15,121 కేసులు నమోదయ్యాయి. దేశంలో 16 రాష్ట్రాల్లో రోజువారీ కేసులు పెరుగుతున్నాయి. 86 శాతం డెత్స్ 10 రాష్ట్రాల్లోనే రికార్డవుతున్నాయి.

11 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ

11,11,79,578 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. 8 రాష్ట్రాల్లోనే 60 శాతం డోసులు సరఫరా చేసినట్లు చెప్పింది. మంగళవారం ఒక్కరోజే  26,46,528 డోసులు ఇచ్చినట్లు తెలిపింది.

ఢిల్లీలో 69 ఆస్పత్రుల్లో ఐసీయూ బెడ్లు ఫుల్

ఢిల్లీలో వెంటిలేటర్లతో కూడిన ఐసీయూ బెడ్లు ఉన్న 94 ఆస్పత్రుల్లో 69 ఆస్పత్రులు ఫుల్ అయ్యాయి. మొత్తం 1,177 వెంటిలేటర్ బెడ్లు ఉండగా.. 79 మాత్రమే ఖాళీగా ఉన్నట్లు ఢిల్లీ కరోనా యాప్ డేటా ద్వారా తెలిసింది. మరో 75 ఆస్పత్రుల్లో వెంటిలేటర్లు లేని ఐసీయూ బెడ్లు అన్నీ ఫుల్ అయ్యాయి. వెంటిలేటర్లు లేని ఐసీయూ బెడ్లు 2,130 దాకా ఉండగా.. 348 మాత్రమే ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా 13,680 బెడ్లు ఉండగా.. 9,041 ఫుల్ అయ్యాయి.
 
యూపీలో మరో జిల్లాలో నైట్ కర్ఫ్యూ

కేసులు పెరుగుతున్నాయని యూపీలోని బహ్రెయిచ్​లో నైట్ కర్ఫ్యూ విధించారు. రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకు ఆంక్షలు ఉంటాయని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ఈ నెల 30 దాకా ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని జిల్లా కలెక్టర్ ఉత్తర్వులిచ్చారు. యూపీలోని మరో 10 జిల్లాల్లోనూ ఇలాంటి రిస్ట్రిక్షన్లు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి.

గుజరాత్​లో అంత్యక్రియలకు క్యూ

గుజరాత్​లో అంత్యక్రియలు నిర్వహించేందుకు జనం గంటలు గంటలు వెయిట్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కరోనా, ఇతర కారణాలతో చనిపోయిన వారికి దహన సంస్కారాలు నిర్వహించేందుకు చాలా సమయం పడుతోంది. వారం రోజుల నుంచి రద్దీ పెరిగిందని ఆఫీసర్లు అంటున్నారు. సాధారణంగా హిందువులు సూర్యాస్తమయం తర్వాత అంత్యక్రియలు నిర్వహించరు, కానీ వేరే దారి లేక రాత్రిళ్లు దహన సంస్కారాలు చేస్తున్నారు. సూరత్​లోని ఉమ్రాలో రెండ్రోజుల కిందట సుమారు 25 డెడ్ బాడీలను వరుసగా దహనం చేశారు. అహ్మదాబాద్, వడోదర సహా చాలా ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి.

ఆక్సిజన్ సప్లై కావట్లే: మహారాష్ట్ర మంత్రి రాజేశ్‌  తోపే
మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేయాలని పక్క రాష్ట్రాలను అడిగామని, కానీ డిమాండ్ ఎక్కువగా ఉండటంతో సప్లై చేయలేమని చెప్పాయని మహారాష్ట్ర హెల్త్ మినిస్టర్ రాజేశ్ తోపే చెప్పారు. రాష్ట్రంలో మెడికల్ ఆక్సిజన్ వేస్టేజ్​ను తగ్గించాల్సిన అవసరం ఉందని చెప్పారు.  ‘‘చత్తీస్​గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాలను ఆక్సిజన్ అడిగాం. కానీ వాళ్లకు కూడా అక్కడ ఎక్కువ అవసరం ఉంది. అందుకే ఇవ్వలేమని అంటున్నారు” అని తెలిపారు. మరోవైపు 144 సెక్షన్ కింద ప్రొహిబిటరీ ఆర్డర్స్​ను ముంబై పోలీసులు జారీ చేశారు. సిటీ ప్రజలు అనవసరంగా బయటికి రావొద్దని, ఐదుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది గుమిగూడకూడదని సూచించారు. బుధవారం రాత్రి నుంచి మే 1వ తేదీ ఉదయం 7 గంటల వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయన్నారు.