హైదరాబాద్ లో భారీ ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెరుగుతున్నాయ్. 2024 జూన్ 29వ తేదీ శనివారం రాత్రి రాత్రి పెద్ద ఎత్తున డ్రంక్ డ్రైవింగ్ టెస్టులు నిర్వహించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో భారీ ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించగా.. 262 మంది పట్టుబడ్డారు. 191 బైకులు, 11 ఆటోలు, 56 కార్ల డ్రైవర్లను ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇందులో 12 మందికి బ్రీత్ ఎనలైజర్ లో 300 పైగా రీడింగ్ వచ్చింది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వారందరి వెహికిల్స్ ను పోలీసులు సీజ్ చేశారు. వీరిని కోర్టులో హాజరుపరచనున్నారు. కాగా బహిరంగంగా మద్యం తాగినా, తాగి వాహనాలు నడిపినా, మద్యం తాగి రోడ్లపై గొడవలకు దిగినా కఠిన చర్యలు తీసుకోవాలని సాక్షాత్తూ సీఎం రేవంత్ రెడ్డి పోలీసులను ఆదేశించిన సంగతి తెలిసిందే. .
ఎవరైనా మద్యం మత్తులో డ్రైవింగ్ చేసి ప్రమాదాలు చేసి ప్రజలను చంపేస్తే, అలాంటి మందుబాబులపై సెక్షన్ 304 పార్ట్ II కింద అరెస్టు చేసి జైలుకు పంపుతామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి చెప్పారు.మందుబాబులకు గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష కూడా విధించవచ్చునని ఆయన పేర్కొన్నారు.