50 లక్షల కుటుంబాలకు చేరువలో గృహజ్యోతి

 50 లక్షల కుటుంబాలకు చేరువలో గృహజ్యోతి
  • ఇటీవల మరోసారి అవకాశం ఇవ్వడంతో భారీగా పెరిగిన లబ్ధిదారులు 
  • పేదలకు ఇప్పటి వరకు  వెయ్యి కోట్లకు పైగా లబ్ధి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్​పొందుతున్న కుటుంబాల సంఖ్య 50లక్షలకు చేరువైంది. ఇటీవల మరోసారి అవకాశం ఇవ్వడంతో జీరో బిల్లులు అందుకుంటున్న  వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగింది. జులై నాటికి గృహజ్యోతికి అర్హత కలిగిన కుటుంబాల సంఖ్య 46 లక్షల 19 వేల 236 కాగా, వీరందరికీ డిస్కంలు జీరో కరెంట్ బిల్లులు జారీ చేశాయి. ఆగస్టు నాటికి ఈ సంఖ్య 48.90లక్షలకు  చేరింది. రాష్ట్ర  ప్రభుత్వం 2024, మార్చి 01 నుంచి గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తోంది.

 200 యూనిట్ల లోపు వినియోగించే లబ్ధిదారులకు జీరో బిల్లులు ఇష్యూ చేసి, ఆ మొత్తాన్ని సర్కారే చెల్లిస్తోంది. స్కీం ప్రారంభించే నాటికి 200 యూనిట్ల లోపు కరెంటు వాడుతున్న కుటుంబాల సంఖ్య 33 లక్షల 86 వేల 507గా ఉంది. అప్పట్లో ప్రత్యేకంగా ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి  దరఖాస్తులు స్వీకరించగా డేటా ఎంట్రీ సమయంలో జరిగిన పొరపాట్ల కారణంగా పలువురు స్కీముకు దూరమయ్యారు. దీంతో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం కొత్తగా సవరణకు అవకాశం కల్పించగా లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగింది. 

 ప్రతి నెలా పేదలకు సగటున వెయ్యి దాకా ఆదా.. 

కాంగ్రెస్ ‌‌ పార్టీ అమలు చేస్తున్న గృహజ్యోతి పథకంతో లక్షలాది మంది వినియోగదారులకు కరెంటు బిల్లుల్లో ఉపశమనం కలుగుతోంది. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత కరెంటుతో ప్రతి కుటుంబానికి రూ.900 నుంచి వెయ్యి రూపాయల భారం తగ్గుతోంది. గృహజ్యోతి పథకంతో వినియోగదారులకు దాదాపుగా రూ.1000కోట్ల వరకు లబ్ధి జరిగింది.  రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్​లో గృహజ్యోతి అమలుకోసం  రూ.2,418 కోట్లను కేటాయించింది.  గత మార్చి నుంచి జులై నాటికి మొత్తంగా ఒక కోటీ 79 లక్షల 33 వేల 430 జీరో బిల్లులు జారీ చేసింది.  

ఈ బిల్లులకు సంబంధించి ప్రభుత్వం మొత్తంగా రూ.640.94 కోట్లు డిస్కంలకు చెల్లించింది. ఆగస్టు నాటికే ఈ జీరో బిల్లుల సంఖ్య రెండుకోట్లకు చేరింది. తాజాగా సెప్టెంబర్​ నెలకు సంబంధించిన బిల్లులు ఈ నెలలో జారీ అవుతున్నాయి. ఈ నెల 24 నాటికి బిల్లింగ్​ పూర్తయితే రెండున్న కోట్ల జీరో బిల్లులు జారీ అయ్యే అవకాశం ఉందని, ఇలా దాదాపు రూ.1000 కోట్లకు పైగా పేద, మధ్యతరగతి  వర్గాలకు లబ్ధి చేకూరినట్లవుతుంది.