మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ లోక్ సభ పరిధిలోని వివిధ రైల్వే స్టేషన్లలో రైళ్ల హాల్టింగ్సంఖ్యను పెంచాలని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ కోరారు. గురువారం సికింద్రాబాద్ లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఎంపీలతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న ఎంపీ మాట్లాడుతూ.. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో తిరువనంతపురం-,రప్తి సాగర్, గరీబ్ రథ్, గ్రాండ్ ట్రంక్, ఏపీ ఏసీ, వందే భారత్ ఎక్స్ ప్రెస్ లకు గతంలో హాల్టింగ్ఉండేదని గుర్తుచేశారు. కేసముద్రం రైల్వేస్టేషన్ లో హాల్టింగ్ ఉండే బీదర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, పద్మావతి ఎక్స్ ప్రెస్, కరీంనగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, సాయినగర్ షిర్డీ, సాయినగర్ షిర్డీ వీక్లీ ఎక్స్ ప్రెస్ లను పునరుద్ధరించాలని కోరారు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా నాగర్ సోల్ ఎక్స్ ప్రెస్, ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైళ్లకు కేసముద్రంలో హాల్టింగ్ ఇవ్వాలని కోరారు. ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించాలని పేర్కొన్నారు. నెక్కొండ రైల్వే స్టేషన్ లో ఇంటర్ సిటీ సూపర్ ఫాస్ట్ , శాతవాహన, చార్మినార్, నవజీవన్, షిరిడి, కరీంనగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్లకు హాల్టింగ్ కల్పించాలని కోరారు.తాళ్ల పూసపల్లి వద్ద గేట్ నంబర్ 79 ఎస్ నం. 428/10-12 వద్ద అండర్ పాస్ బ్యాలెన్స్ పనులు పూర్తి చేయాలని వివరించారు. డోర్నకల్ రైల్వేస్టేషన్ లో పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, కోణార్క్ ఎక్స్ ప్రెస్, నాగర్ సోల్ ఎక్స్ ప్రెస్ లను హాల్టింగ్ కల్పించాలని, తాము ప్రతిపాదించిన అంశాలను పరిగణలోకి తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ సమావేశంలో కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లంనాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.