
న్యూఢిల్లీ: మన దేశంలో 80 కోట్ల కంటే ఎక్కువ ఆస్తులు ఉన్న ఇండియన్ హై నెట్వర్త్ ఇండివిడువల్స్(హెచ్ఎన్డబ్ల్యూఐలు) సంఖ్య గత సంవత్సరం 6 శాతం పెరిగి 85,698కి చేరుకుందని తేలింది. గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ బుధవారం 'ది వెల్త్ రిపోర్ట్ 2025'ను విడుదల చేసింది. దీని ప్రకారం.. మనదేశంలో హెచ్ఎన్డబ్ల్యూఐల జనాభా గత ఏడాది 85,698 మంది కాగా, అంతకుముందు ఏడాది 80,686గా ఉంది. 2028 నాటికి ఈ సంఖ్య 93,753కి పెరుగుతుందని అంచనా. భారత్లో సంపన్నుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది.
2024లో బిలియనీర్ల జనాభా కూడా పెరిగింది. ప్రస్తుతం వీరి సంఖ్య 191కు చేరింది. వీరిలో 26 మంది గత సంవత్సరంలోనే లిస్టులో చేరారు. 2019లో బిలియనీర్ల సంఖ్య ఏడు మాత్రమే ఉండటం గమనార్హం. భారతీయ బిలియనీర్ల మొత్తం సంపద 950 బిలియన్ డాలర్లు ఉంటుంది. ఈ విషయంలో మనదేశం ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో ఉంది. యూఎస్ ( 5.7 ట్రిలియన్ డాలర్లు) మెయిన్‌ల్యాండ్ చైనా ( 1.34 ట్రిలియన్ డాలర్లు) మొదటి, రెండోస్థానాల్లో ఉన్నాయని నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజల్ అన్నారు. రాబోయే దశాబ్దంలో ప్రపంచ సంపద సృష్టిలో భారతదేశం వాటా ఇంకా పెరుగుతుందని అన్నారు.