మహబూబాబాద్, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోడు లబ్ధిదారుల సంఖ్య ఫైనల్ అయింది. పోడు రైతులందరికీ పట్టాలు ఇస్తామన్న ప్రభుత్వ ప్రకటనతో గిరిజనులతో పాటు గిరిజనేతరులు సైతం అప్లై చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో వేలాది అప్లికేషన్లు రాగా ఆఫీసర్లు సర్వే నిర్వహించి అర్హులైన వారు వందల్లోనే ఉన్నారని తేల్చారు. అయితే ఈ లిస్ట్‌ను ఇప్పుడే బయటకు రిలీజ్ చేస్తే ఆందోళనలు జరిగే అవకాశం ఉండడంతో లబ్ధిదారుల వివరాలను బయటకు పొక్కనీయడం లేదు.
అప్లికేషన్లు 99 వేలు.. అర్హులు 5 వేలు
పోడు భూముల కోసం ఉమ్మడి జిల్లాలో సుమారు 99 వేల అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో భూపాలపల్లి జిల్లాలలో 63,077 ఎకరాలకు 25,021 అప్లికేషన్లు రాగా వరంగల్‌లో 9,968 ఎకరాలకు 7,711 అప్లికేషన్లు, ములుగులో 91,843 ఎకరాలకు 34,044 అప్లికేషన్లు, మహబూబాబాద్‌లో 1,15,948 ఎకరాలకు 32,697 అప్లికేషన్లు వచ్చాయి. అయితే డివిజన్, గ్రామస్థాయిలో సర్వే నిర్వహించిన ఆఫీసర్లు ఉమ్మడి జిల్లాలో మొత్తం 5 వేల మందే అర్హులు ఉన్నట్లు తేల్చారు.
గిరిజనేతరులకు మొండిచెయ్యి
గిరిజనులతో పాటు గిరిజనేతరులకు సైతం పోడు పట్టాలు ఇస్తామన్న ప్రభుత్వ ప్రకటనతో ఇక తమ కష్టాలు తీరినట్లేనని భావించిన వారికి నిరాశే మిగలనుంది. గిరిజనేతరులు పోడు పట్టాల కోసం అప్లై చేసుకోవాలంటే 1930 నుంచి 75 సంవత్సరాల పాటు పోడు సాగు చేసుకుంటున్నట్లు ఆఫీసర్ల నుంచి సర్టిఫికెట్ తీసుకోవాలని రూల్ పెట్టింది. ఈ కారణంతో చాలా మంది అనర్హులుగా మారుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో బయ్యారంలో 1,319, గంగారంలో 759, గార్లలో 11, గూడూరులో 1,636, కేసముద్రంలో 1,454, కొత్తగూడలో 3,474, కురవిలో 29, మహబూబాబాద్‌లో 809, నెల్లికుదురులో 768 మంది గిరిజనేతరులు పట్టాదార్ పాస్‌బుక్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఒక్కరికి కూడా పాస్ బుక్స్ మంజూరు కాలేదు.
గిరిజనేతరులను విస్మరిస్తే పోరాటం
గిరిజనేతరులకు సైతం పోడు పట్టాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు మోసం చేయడం సరికాదు. మేము 44 ఏళ్ల నుంచి పోడు భూములు సాగు చేసుకుంటూ జీవిస్తున్నాం. గిరిజనులకు పట్టాలు ఇచ్చి మాకు ఇవ్వకుంటే అధికార పార్టీ నాయకులు గ్రామాల్లోకి రాకుండా అడ్డుకుంటాం.
- ఉల్లంగుల రమేశ్, వేలుబెల్లి, కొత్తగూడెం మండలం