ఉమ్మడి జిల్లాలో తగ్గిన రిజిస్ట్రేషన్లు.. ఆదాయం అంతంతే

ఉమ్మడి జిల్లాలో తగ్గిన రిజిస్ట్రేషన్లు.. ఆదాయం అంతంతే
  • పెరిగింది రెండు శాతమే 
  • వరుస ఎన్నికల ఎఫెక్ట్​  !

వనపర్తి, వెలుగు :  ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2023– -24 ఆర్థిక సంవత్సరంలో  రిజిస్ర్టేషన్ల సంఖ్య  తగ్గింది. దీంతో ఆదాయం అంతంత మాత్రంగానే వచ్చింది.  కిందటి ఫినాన్షియల్​ ఇయర్​ కంటే  ఈసారి కేవలం రూ.5.56 కోట్లు  మాత్రమే ఎక్కువ  ఆదాయం సమకూరింది.   నిరుడు పంటలు సరిగా పండక భూములు, ఇతర స్థిరాస్తి క్రయవిక్రయాలు  తగ్గాయి.  

ఉమ్మడిపాలమూరు లోని 12 సబ్​ రిజిస్ర్టార్​ ఆఫీస్లల్లో   2022–-23లో 1,02,688   రిజిస్ట్రేషన్లు కాగా రూ. 244.49 కోట్లు  వచ్చాయి.   2023-–24లో 98,900 కాగా రూ. 250.05 కోట్లు వచ్చాయి.  ఖరీఫ్​ సీజన్​లో  అసెంబ్లీ ఎన్నికల హడావుడి ఉండటంతో  రిజిస్ట్రేషన్ల పై ఆ   ప్రభావం పడింది.   అనంతరం ప్రభుత్వం మార్పు,  ఎమ్మెల్సీ, పార్లమెంట్​ ఎన్నికల వాతావరణం కారణంగా రిజిస్ట్రేషన్లు తగ్గినట్టు తెలుస్తోంది. 
 
జడ్చర్లలో ఆదాయం మెరుగు

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సబ్​ రిజిస్ర్టారు ఆఫీసులలో జడ్చర్ల ఆఫీసులో  ఈ సంవత్సరం కేవలం అయిదు వందల రిజిస్ర్టేషన్లు తగ్గినా ఆదాయం మెరుగ్గానే ఉంది.  ఇక్కడ 16598 రిజిస్ర్టేషన్లు  జరిగాయి. రూ.61.98కోట్ల ఆదాయం సమకూరింది.  అదే నిరుడు 17055కు రూ.54.26కోట్లే  వచ్చింది.  అలంపూర్​లో అతితక్కువ రిజిస్ర్టేషన్లు జరిగాయి. అక్కడ1999 రిజిస్ర్టేషన్లు జరగ్గా ఆదాయం రూ.2.70కోట్లు వచ్చాయి.

నాలుగేళ్ల వరకు డీటీసీపీ అనుమతి లేని వెంచర్లలోని ప్లాట్లను రిజిస్ర్టేషను చేస్తూ వచ్చారు.  తరువాత డీటీసీపీ లేని వాటి రిజిస్ర్టేషన్లను నిలిపేశారు.  అనుమతుల్లేని వెంచర్లలో ప్లాట్లు కొని రిజిస్ర్టేషన్లు చేసుకోని వారు తరువాత రిజిస్ర్టేషన్లు చేసుకుందామన్న కుదరలేదు.  ఆ   వెంచర్లలో  అంతకుముందే ప్లాట్లు కొని మొదటి సారిగా రిజిస్ర్టేషను చేసుకున్న వారు .. రెండో రిజిస్ర్టేషను  చేసుకొనే వీలుండటంతో  క్రయవిక్రయాలు కొంత మెరుగుపడ్డాయి.  ఎల్​ఆర్​ఎస్​ చేసుకోడానికి అనుమతివ్వడంతో వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.

తీరా దానిపై స్పష్టత లేకపోవడంతో  అది అక్కడితోనే ఆగిపోయింది.  గతంలో  ప్రభుత్వం భూముల మార్కెట్​ విలువను పెంచడంతో  రిజిస్ర్టేషన్ల ద్వారా ఆదాయం పెరిగింది.  స్టాంపులు, రిజిస్ర్టేషన్లశాఖకు ఆదాయం సమకూర్చడంలో జడ్చర్ల, మహబూబ్​నగర్​ తరువాత వనపర్తి జిల్లా మూడో  స్థానంలో ఉంది.  ఇక్కడా రియల్​ఎస్టేట్​ పెరిగినా..  ఒక సంవత్సర కాలంలో క్రయవిక్రయాలు మందగించాయి.  

ఆర్థిక సంవత్సరం చివరాఖరులో  ఇక్కడ పనిచేసిన సబ్​ రిజిస్ర్టార్​ క్రిస్టఫర్​ ఇష్టారీతిగా రిజిస్ర్టేషన్లు చేశారని ఫిర్యాదులు వెల్లువెత్తడంతో  అతన్ని ఫిబ్రవరిలో సస్పెండ్​  చేశారు.  అతని స్థానంలో వచ్చిన ఇన్​చార్జి కూడా రెండు, మూడు రోజులు పనిచేయలేదు. తీరా ఆఫీసులోని జూనియర్​ అసిస్టెంట్​తోనే పని కానిస్తున్నారు.