
గవర్నమెంట్,ప్రైవేట్ స్కూళ్లు,కాలేజీల్లో పని చేస్తున్న టీచర్లు, లెక్చరర్ల వివరాలు సేకరించడంలో ఇబ్బందులేర్పడుతున్నాయి. రాష్ట్రం మొత్తం 43,017 విద్యాసంస్థల్లో 2.4 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. వీరి వివరాలను ఆన్ లైన్ లో పొందుపర్చాలని పాఠశాల విద్యాశాఖ భావించింది.మార్చి 2 నుంచి 16లోగా వివరాలన్నీ ఆన్ లైన్ లో అప్ డేట్ చేయాలని డీఈఓలకు అప్పట్లో ఆదేశాలిచ్చింది. ఇప్పటికే యూడైస్ ద్వారా సేకరించిన వివరాల్లో మార్పులు సరిచేసి, అప్ డేట్ చేస్తే సరిపోతుందని సూచించింది. అయితే నిర్ణీత సమయం (మార్చి16) నాటికి కేవలం1.09 లక్షల టీచర్ల వివరాలే అప్ డేట్ అయ్యాయి. అంటే సగం మంది వివరాలు కూడా రాలేదన్నమాట. దీంతో గడువును ఈనెల 23 నాటికి పొడిగించారు. అయినా కేవలం1.45 లక్షల (60.60%) వివరాలే అప్ డేట్ చేశారు. ఇవన్నీ కేవలం 26,062 స్కూళ్ల టీచర్ల వివరాలే. దీంతో మరో రెండు సార్లు డేట్లు పొడగించారు. అయినా ఇప్పటికీ33 వేల విద్యాసంస్థల నుంచి 1.90 లక్షల(79%)మంది వివరాలు మాత్రమే అందినట్టు అధికారులు చెప్తున్నారు. అయితే వీటిలో గవర్నమెంట్ టీచర్ల వివరాలే ఎక్కువున్నాయి. ప్రైవేట్ టీచర్ల వివరాలివ్వడంలో యా జమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని విద్యాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈనెల 23లోగా టీచర్ల వివరాలను అప్ డేట్ చేయాలని మరోసారి డీఈఓలకు ఆదేశించారు.
టెక్నికల్ సమస్యతో…
టీచర్ల డేటాను అప్ డేట్ చేయడంలో టెక్నికల్ సమస్యలు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో కొత్త జిల్లాలు,మండలాలు ఏర్పడ్డాయి. దానికి అనుగుణంగా స్కూళ్ల యూడైస్ కోడ్స్ మారా యి. టీచర్ల బదిలీలూ జరిగాయి. వారు కొత్తగా వెళ్లి న మండలాల్లో వివరాలు ఎంట్రీ చేస్తే, పాత జిల్లా, పాత మండలం డైస్ కోడ్స్ కన్పిస్తున్నాయి. వాటిని మార్చాలని ఎస్ ఎస్ ఏ ఉన్నతాధికారులకు చెప్పి నా పట్టిం చుకోవడం లేదని కిందిస్థాయి సిబ్బంది చెబుతున్నారు. ఈ సమస్యను అధిగమిస్తేనే టీచర్ల పూర్తి వివరాలు సే కరించే వీలుంది. అయితే ఈ సమస్య కొంత తీరిందనీ, ప్రభుత్వ, లోకల్ బాడీ స్కూళ్లలో దాదాపు టీచర్ల వివరాలు సేకరించినట్టు అధికారులు చెబుతున్నారు. కానీ ప్రైవేటు విద్యాసంస్థలతోపాటు సంక్షేమ శాఖలకు సంబంధించిన స్కూళ్లలో పనిచేసే టీచర్ల వివరాలను ఇవ్వడంలేదని పేర్కొంటున్నారు. సంగారెడ్డితోపాటు పలు జిల్లాల్లో వివరాలు ఇవ్వబోమని ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు వాదిస్తున్నట్టు తెలిసింది. అయితే వారిని కన్విన్స్ చేయడంలో ఆ జిల్లా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలున్నాయి.