
- ఉమ్మడి మెదక్ జిల్లాలో చాన్స్ఇవ్వని పార్టీలు
మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లాలో మహిళా ఓటర్లే ఎక్కువున్నా అసెంబ్లీకి వారి ప్రాతినిధ్యం మాత్రం చెప్పుకోదగ్గస్థాయిలో లేదు. మొదటి నుంచి రాజకీయపార్టీలు మహిళలకు టికెట్ ఇవ్వడానికి వెనకాముందాడుతున్నాయి. 1952 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా నుంచి కేవలం ఐదుగురు మహిళలు మాత్రమే శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే ఈ ఐదుగురిలో ఇద్దరు రాష్ట్ర మంత్రులుగా, ఒకరు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా పని చేశారు.
రెండు చోట్ల నుంచి పద్మ ఎన్నిక
మెదక్ జిల్లానుంచి ముగ్గురు మహిళలు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. 1962 అసెంబ్లీ ఎన్నిల్లో మెదక్‌నుంచి సీపీఐ పార్టీ క్యాండిడేట్‌గా పోటీ చేసిన కేవల్ ఆనందాదేవి మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. టీడీపీ హయాంలో మెదక్ నుంచి గెలిచి మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కరణం రాంచందర్రావ్చనిపోవడంతో 2002 లో ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికలో రాంచందర్ రావ్ భార్య కరణం ఉమాదేవి టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన పద్మా దేవేందర్‌రెడ్డి వరుసగా రెండు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆమె తెలంగాణ అసెంబ్లీ తొలి డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. పద్మా దేవేందర్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో 2004 ఎన్నికల్లో రామాయంపేట నుంచి కూడా టీఆర్ఎస్క్యాండిడేట్గా గెలిచారు. ఉద్యమకాలంలో టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయగా 2008లో ఉప ఎన్నిక జరిగింది. ఉప ఎన్నికల్లోనూ పద్మ పోటీ చేసినా ఓడిపోయారు.
నర్సాపూర్‌లో సునీతారెడ్డి హ్యాట్రిక్
నర్సాపూర్అసెంబ్లీ స్థానంలో వాకిటి సునీతా లక్ష్మారెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. శివ్వంపేట జడ్పీటీసీగా ఉన్న ఆమె భర్త లక్ష్మారెడ్డి ప్రమాదంలో మరణించగా ఆయన వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ఆమెకు నర్సాపూర్నుంచి టికెట్ ఇవ్వగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లోనూ కాంగ్రెస్అభ్యర్థిగా గెలుపొంది హ్యాట్రిక్ కొట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సునీతారెడ్డి రెండు సార్లు మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2014, 2018 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.
గజ్వేల్, జహీరాబాద్‌ల నుంచి గీతారెడ్డి
సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లోని గజ్వేల్, జహీరాబాద్ఎస్సీ రిజర్వ్డ్అసెంబ్లీ స్థానాల నుంచి జె. గీతారెడ్డి ప్రాతినిధ్యం వహించారు. గజ్వేల్ నుంచి 1989, 2004 ఎన్నికల్లో గీతారెడ్డి గెలిచారు. 1994,1999 ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమి చెందారు. అసెంబ్లీ స్థానాల పునర్విభజనలో జహీరాబాద్ ఎస్సీలకు రిజర్వు కాగా 2014 లో ఇక్కడ నుంచి కాంగ్రెస్ క్యాండిడేట్‌గా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. గీతారెడ్డి సుదీర్ఘకాలం మంత్రిగా ఉన్నారు. 2018 లో సిద్దిపేట అసెంబ్లీ స్థానం నుంచి టీజెఎస్ అభ్యర్థిగా భవానిరెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ప్రధాన పార్టీల ఇతర నియోజకవర్గాల్లో మహిళలెవరికీ టికెట్లు ఇవ్వలేదు. పలువురు మహిళలు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేసినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.