యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలోని భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో యువ ఓటర్ల సంఖ్య తగ్గింది. మిడిల్ ఏజ్ ఓటర్ల సంఖ్య పెరిగిపోయింది. ఇటీవలే ఫైనల్ ఓటర్ జాబితాను విడుదల చేసిన ఎన్నికల సంఘం, తాజాగా వయసుల వారీగా ఓటర్ల లెక్కను రిలీజ్ చేసింది.
19 ఏండ్ల ఓటర్లు 4.07 శాతమే
18 ఏండ్ల వయసు రాగానే ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ఎన్నికల కమిషన్ ప్రచారం చేస్తున్నా స్టూడెంట్స్ యువత పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు కదా అని కొందరు.. అదిఅవసరమా..? అన్నట్టుగా మరికొందరు ఓటర్లుగా నమోదు చేయించుకోవడం లేదు. దీంతో యువ ఓటర్ల సంఖ్య తక్కువగా కన్పిస్తోంది.
ఎన్నికల కమిషన్ రిలీజ్ చేసిన ఫైనల్ ఓటర్ జాబితా ప్రకారం జిల్లాలోని భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో 4,60,899 మంది ఓటర్లున్నారు. వీరిలో 2,32,761 మంది మహిళలు కాగా 2,28,117 మంది పురుషులు ఉన్నారు. మొత్తం ఓటర్లలో 30 ఏండ్లలోపు యువత 23 శాతం (1,06,674 మంది) ఉన్నారు. వీరిలో కొత్తగా ఓటు హక్కు పొందిన 19 ఏండ్ల ఓటర్లు కేవలం 4.07 శాతమే (10,615) ఉన్నారు.
49 ఏండ్లున్నోళ్లు 45 శాతానికి..
ఓటర్లలో మిడిల్ ఏజ్ ఉన్న ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు. 30 నుంచి 49 ఏండ్లున్నోళ్ల ఓటర్లు 45 శాతానికి మించి ఉన్నారు. ఓటర్లలో 30 నుంచి 49 ఏండ్ల వయసున్నోళ్లు 2,10,208 మంది ఉన్నారు. వీరిలో 30–39 ఏండ్లున్నోల్లు 1,19,610 మంది ఉండగా, 49 ఏండ్లున్నోల్లు 90,598 మంది ఓటర్లున్నారు.
69 ఏండ్లలోపున్నోళ్లు
69 ఏండ్లలోపున్న సీనియర్ సిటిజన్లు 25 శాతానికి ఉన్నారు. ఓటర్లలో 50 ఏండ్ల నుంచి 69 ఏండ్లలోపున్నోళ్లు 1,11,407 మంది ఉన్నారు. వీరిలో 59 ఏండ్లలోపున్నోళ్లు 67,266 మంది ఉండగా 69 లోపున్నోళ్లు 44,141 మంది ఉన్నారు.
80 దాటినోళ్లు మొత్తం ఓటర్లలో 80 ఏండ్లు దాటినోళ్లు 32,610 మంది ఉన్నారు. వీరిలో 70 నుంచి 79 ఏండ్లున్నోళ్లు 24,789 మంది ఉన్నారు. 80 నుంచి 89 ఉన్నోళ్లు 6937 మంది ఉన్నారు. 90 నుంచి 99 ఉన్నోళ్లు 860 మంది ఉన్నారు. 100 నుంచి 109 మంది వరకూ 20 వరకూ ఉండగా 110 నుంచి 119 వరకూ ఒక్కరు కూడా లేరు. 120 దాటినోళ్లు నలుగురు ఓటర్లు ఉన్నారు.