న్యూఢిల్లీ: ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (ఈఎఫ్‌టీ) కుదరడంతో ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి స్విట్జర్లాండ్ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని స్విస్ స్టేట్ సెక్రెటరీ (ఎకనామిక్ అఫైర్స్) హెలెన్ బడ్లిగర్ అన్నారు. చాక్లెట్లను తయారు చేసే బేరీ కాలెబౌట్ గ్రూప్, టెక్ కంపెనీ బలెర్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాయని పేర్కొన్నారు. హెస్ గ్రీన్ మొబిలిటీ 2025 నాటికి 3,000 ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేయాలని టార్గెట్ పెట్టుకుందని, రానున్న ఆరు నుంచి ఎనిమిదేళ్లలో 110 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనుందని అన్నారు.
బేరీ కాలెబౌట్ గ్రూప్ ఇండియాలోని తన మూడో మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్‌ను ఈ ఏడాది ప్రారంభించనుందని చెప్పారు. గత ఐదేళ్లలో 50 మిలియన్ డాలర్లను ఈ కంపెనీ ఇన్వెస్ట్ చేసిందని అన్నారు. అదే విధంగా బలెర్ వచ్చే రెండు నుంచి మూడేళ్లలో 23 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుందని చెప్పారు. కంపెనీ ఇండియాలో తన బిజినెస్ మొదలు పెట్టి 30 ఏళ్లు కావొస్తోందని అన్నారు. ఈఎఫ్‌టీఏ దేశాలైన స్విట్జర్లాండ్, లిక్‌టున్‌స్టైన్, నార్వే, ఐస్‌ల్యాండ్‌తో ఇండియా తాజాగా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కుదుర్చుకున్న విషయం తెలిసిందే.