- యూపీలో 10 మందిపిల్లల మరణానికినర్సు నిర్లక్ష్యమే కారణం
- ఆక్సిజన్ సిలిండర్ పైప్ కనెక్ట్ చేస్తుండగా అగ్గిపుల్ల గీసిన నర్సు
- మరో 16 మంది పిల్లలకు సీరియస్
- ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించిన యూపీ సర్కార్
లక్నో/ఝాన్సీ: ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కాలేజీలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఎన్ఐసీయూ)లో శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో 10 మంది శిశువులు సజీవ దహనం అయ్యారు. మరో 16 మంది శిశువుల హెల్త్ కండిషన్ సీరియస్‌గా ఉన్నదని డాక్టర్లు ప్రకటించారు. ఆక్సిజన్ సిలిండర్ పైప్‌ను కనెక్ట్ చేస్తున్న టైమ్‌లో ఓ నర్సు నిర్లక్ష్యంగా అగ్గిపుల్ల వెలిగించినట్లు ఓ ప్రత్యక్ష సాక్షి చెప్తున్నాడు. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే ఎన్ఐసీయూ మొత్తం మంటలు వ్యాపించాయి. తన తువ్వాలులో నలుగురు శిశువులను చుట్టుకుని సేఫ్‌గా బయటికి తీసుకొచ్చినట్లు అతను తెలిపాడు. స్థానికుల సాయంతో మరికొంత మందిని రక్షించినట్లు చెప్పాడు.
మంటలు వ్యాపించి.. దట్టంగా పొగలు కమ్ముకోవడంతో హాస్పిటల్లో ఉన్నవాళ్లంతా భయంతో పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట జరిగి పలువురు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్ఐసీయూ వార్డులో ఎక్స్పైర్ అయిన ఫైర్ సేఫ్టీ పరికరాలను స్థానికులు గుర్తించారు. మంటలు చెలరేగిన వెంటనే ఫైర్ అలారమ్‌లు కూడా పని చేయలేదని ఆరోపించారు. దీంతో శిశువులను తరలించడంలో ఆలస్యమైంది. ఫలితంగా 10 మంది శిశువులు సజీవ దహనం అయ్యారు. కాగా, ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్, ఫైర్ అలారం పని చేయలేదన్న వాదనలను యూపీ ప్రభుత్వం ఖండించింది.
రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
పది మంది శిశువులు చనిపోయారని తెలిసి చాలా బాధేసిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. గాయపడిన చిన్నారులు స్పీడ్‌గా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు ఆమె చెప్పారు. యూపీలో ఝాన్సీ మెడికల్ కాలేజీలో జరిగిన అగ్ని ప్రమాదం హృదయ విదారకంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు. మృతులకుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన శిశువుల ఫ్యామిలీకి రూ.50 వేలు అందిస్తామన్నారు. 10 మంది శిశువులు కోల్పోయిన వారి కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ప్రగాఢ సానుభూతి ప్రకటించింది.
బాధితులకు అండగా ఉంటం: యూపీ సీఎం
ఎన్ఐసీయూ ఫైర్ యాక్సిడెంట్‌పై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యూపీ ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం, గాయపడ్డవాళ్లకు రూ.50 వేలు అందిస్తామని ప్రకటించారు. ఈ ఘటనపై మూడంచెల దర్యాప్తు జరిపించాలని ఆదేశించారు. గాయపడిన 16 మంది శిశువులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఫైర్ సేఫ్టీ సిస్టమ్ బాగానే ఉన్నదని వివరించారు.
హాస్పిటల్ ముందు బాధిత కుటుంబాల నిరసన
ప్రమాదం జరిగినప్పుడు వార్డులో 54 మంది శిశువులు ఉండగా.. 44 మందిని కాపాడారు. చనిపోయి న 10 మందిలో ఏడుగురిని గుర్తించామని, ముగ్గురిని డీఎన్ఏ టెస్ట్ ద్వారా ఐడెంటిఫై చేస్తామని అధికారులు తెలిపారు. ‘‘షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగింది. దర్యాఫ్తు జరిపిస్తున్నాం. ఒకవేళ మానవ తప్పిదం వల్లే ఈ ఘోరం జరిగి ఉంటే ఎవరినీ వదలం. ఫైర్ సేఫ్టీ పరికరాలన్నీ బాగానే ఉన్నాయి’’ అని మంత్రి పాఠక్ తెలిపారు. కాగా, ట్రీట్మెంట్ పొందుతున్న చిన్నారులను చూసేందుకు అధికారులు అనుమతించడంలేదంటూ తల్లిదండ్రులు హాస్పిటల్ ముందు నిరసన చేపట్టారు.
ఇతరులను కాపాడి..తన కూతుళ్లను పోగొట్టుకున్నడు
అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు వార్డు ముందు పడుకున్న యాకుమ్ మన్సూరీ కొంత మంది శిశువులను కాపాడాడు. కానీ.. తన ఇద్దరు కూతుళ్లు మాత్రం సజీవ దహనం అయ్యారని కన్నీటిపర్యంతమయ్యాడు. డాక్టర్లు డెడ్‌బాడీలను చూపించినా తన కూతుళ్లను గుర్తుపట్టలేకపో యానని చెప్పాడు. 11 రోజుల కిందే తాను బిడ్డకు జన్మనిచ్చానని, అరుపులు విని ఎన్ఐసీయూకు వచ్చేసరికి అంతా అయిపోయిందని సంతోషి అనే బాలింత ఏడుస్తూ తెలిపింది.