అంగన్ వాడీ కేంద్రాల్లో నర్సరీ క్లాసులు.. జిల్లా స్థాయి ఆఫీసర్లతో మంత్రి రివ్యూ మీటింగ్

అంగన్ వాడీ కేంద్రాల్లో నర్సరీ క్లాసులు.. జిల్లా స్థాయి ఆఫీసర్లతో మంత్రి  రివ్యూ మీటింగ్

హైదరాబాద్, వెలుగు:  అంగన్ వాడీ కేంద్రాల్లో ఇక నుంచి నర్సరీ క్లాస్ లనూ బోధించనున్నారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి రావాలని సెక్రటేరియెట్ లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మంత్రి సీతక్క ఇన్వైట్ చేశారు.  బుధవారం ఆమె మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణ, కమిషనర్ కాంతి వెస్లీ, జిల్లా సంక్షేమ అధికారులు, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

అంగన్ వాడీ కేంద్రాలు, మహిళా భద్రత, దత్తత, చైల్డ్ కేర్ వంటి అంశాలపై చర్చించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ..అంగన్ వాడీ కేంద్రాల్లో చిన్నారుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా "అమ్మ మాట- అంగన్ వాడీ బాట" పేరుతో  ఈ నెల 15 నుంచి వారం రోజులపాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నట్లు వెల్లడించారు. అంగన్ వాడీ కేంద్రాల్లో అందుతున్న సరుకులు, సేవల నాణ్యతను పెంచాలని అధికారులకు సూచించారు. నాసిరకం కోడిగుడ్లు, పాల ప్యాకెట్లు సరఫరా చేస్తున్న చోట జిల్లాస్థాయి, క్షేత్రస్థాయి అధికారులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు అంగన్ వాడీలను విజిట్ చేసి నివేదికను సమర్పించాలని స్పష్టం చేశారు. 

పోషకాహారం అందించడమే లక్ష్యం

రాష్ట్రంలోని పేద పిల్లలకు పోషకాహారం, విద్య, భద్రత అందించడమే లక్ష్యంగా అంగన్ వాడీ కేంద్రాలు పని చేయాలని అధికారులకు మంత్రి సీతక్క స్పష్టం చేశారు. సరైన ఆహారం అందించకపోతే తల్లి, పిల్లలకు దీర్ఘకాలిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. అందుకే పర్యవేక్షణ కోసం ఫ్లయింగ్ స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అంగన్ వాడీ చిన్నారులకు త్వరలో యూనిఫాంలు అందజేస్తామని చెప్పారు. 

పిల్లల దత్తత ప్రక్రియను సులభతరం చేసినట్టు వెల్లడించారు. నిబంధనలకు అనుగుణంగా పిల్లలను త్వరితగతిన దత్తత తీసుకునేలా సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. ఈ విషయం ప్రజలకు చేరే విధంగా ప్రచార కార్యక్రమాలను రూపొందించాలని అధికారులకు సూచించారు. మహిళలు, చిన్నారులపై దాడులు, అఘాయిత్యాలు జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని సీతక్క స్పష్టం చేశారు. సమావేశంలో యునిసెఫ్  సౌజన్యంతో రూపొందించిన న్యూట్రిషీయన్ ఛాంపియన్ పుస్తకాన్ని, న్యూట్రిషీయన్ కిట్లను ఆమె ఆవిష్కరించారు.

మహిళా ఎన్జీవో ప్రతినిధులతో భేటీ

 మహిళలు చిన్నారుల సంరక్షణ కోసం పనిచేసే పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మంత్రి సీతక్కతో భేటీ అయ్యారు. మహిళల సంరక్షణ, సాధికారతపై సీతక్కతో  తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధి కాలిఫోర్నియాకి చెందిన మంజుల కృష్ణన్, అంకురం ఎన్జీవో ప్రతినిధులు సుమిత్ర, విజయ చర్చించారు. ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలో విమెన్ ప్రొటెక్షన్, చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న మహిళల సంక్షేమానికి కృషి చేయాలని సీతక్కని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ మహిళల నైపుణ్యాన్ని పెంచి ఉపాధి అవకాశాలు కల్పించే దిశలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయాలని మంత్రి కోరగా.. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. తెలంగాణ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం తమ వంతు సహకారం అందిస్తామన్నారు.