- నర్సింగ్ పోస్టుల్లో జాప్యంపై అభ్యర్థుల ఆందోళన
- కోఠిలోని డీహెచ్ ఆఫీసు ఎదుట ధర్నా
- మూడేండ్లైనా పూర్తికాని నర్సింగ్ ఉద్యోగాల భర్తీ
- 2017లో 3,311 పోస్టులకు నోటిఫికేషన్
- అవకతవకలతో ఆగిపోయిన సర్టిఫికెట్ వెరిఫికేషన్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం, హెల్త్ డిపార్ట్‌మెంట్ తమ బతుకులతో ఆడుకుంటున్నాయని నర్సింగ్ పోస్టుల అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పోస్టుల భర్తీలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ హైదరాబాద్ కోఠిలోని పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నా చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో కోఠి ఉమెన్ కాలేజీ ముందు రోడ్డుపైనే బైఠాయించి తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ప్రాణాలకు తెగించి కరోనా పేషెంట్లకు సేవలు అందించిన తమకు దక్కే ప్రతిఫలం ఇదేనా అంటూ విలపించారు. ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో మూడేండ్ల నుంచి ఎదురు చూస్తున్నామని, ఇంకెన్నాళ్లు సాగదీస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వ పెద్దలు పట్టించుకోకపోవడంతో అవినీతి ఆఫీసర్లు భర్తీ ప్రక్రియను ముందుకు సాగనీయడం లేదని వారు ఆరోపించారు. వారిని పోలీసులు అక్కడ్నుంచి బలవంతంగా ఈడ్చుకెళ్లి, సమీప పోలీస్స్టేషన్లకు తరలించారు.
మూడేండ్లుగా ఇదే గోస
ప్రభుత్వ దవాఖాన్లలోని 3,311 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి 2017లో నోటిఫికేషన్ ఇచ్చారు. 2018లో రాత పరీక్ష నిర్వహించారు. సుమారు 21 వేల మంది ఎగ్జామ్ రాశారు. కోర్టు కేసులతో రెండేండ్లు రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ముందుకు సాగలేదు. కోర్టు క్లియరెన్స్‌తో గత ఏడాది నవంబర్ మొదటి వారంలో మెరిట్ లిస్ట్ ప్రకటించారు. అందులోనూ అనేక అవకతవకలకు పాల్పడి, అనర్హులకు వెయిటేజీ మార్కులు కలిపారు. ఈ విషయం బయటకు పొక్కడం, నిరుద్యోగుల నిరసనలతో సర్టిఫికెట్ వెరిఫికేషన్ వాయిదా పడింది. అక్రమంగా మార్కులు పొందిన వారిని తీసేసి వెంటనే మెరిట్ లిస్టును ప్రకటిస్తామని చెప్పిన సర్కార్.. ఇప్పటివరకూ రివైజ్డ్ లిస్ట్ ప్రకటించలేదు. వెయిటేజీ మార్కులు పొందిన వారిలో దొంగలు ఎవరో, దొరలు ఎవరో తేల్చేందుకు ముగ్గురు ఆఫీసర్లతో నవంబర్‌లోనే కమిటీ వేశారు. ఈ కమిటీ.. మెరిట్ లిస్ట్‌లో చాలా మంది అనర్హులు ఉన్నట్టు గుర్తించింది. కొంతమందికి కొత్తగా వెయిటేజీ మార్కులు కలిపింది. అయితే, ఎవరిని ఎందుకు తీసేశారు? కొత్త వాళ్లకు ఏ ప్రతిపాదికన మార్కులు కలిపారనే విషయాన్ని టీఎస్‌పీఎస్సీకి ఇచ్చిన రిపోర్టులో స్పష్టంగా పేర్కొనలేదు. దీంతో డిసెంబర్ 15న కమిటీ ఇచ్చిన రిపోర్టును టీఎస్‌పీఎస్సీ వెనక్కి పంపించింది. రీవైజ్డ్ మెరిట్ లిస్ట్ ప్రకటించకుండా సాగదీస్తుండడంతో ఉద్యోగాలపై ఆశలు పెట్టుకున్న వందల మంది ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ శుక్రవారం ధర్నాకు దిగారు.
అవినీతి ఆఫీసర్లపై చర్యలేవి?
రూల్స్ ప్రకారం ప్రభుత్వ దవాఖాన్లలో కాంట్రాక్ట్ బేసిస్‌పై పనిచేసే వారికి మాత్రమే వెయిటేజీ ఇవ్వాలి. కానీ, హెల్త్ డిపార్ట్‌మెంట్‌లోని కొంత మంది ఆఫీసర్లు, హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు, హెల్త్ యూనియన్ల నాయకులు, డీఎంహెచ్‌వోలు కుమ్మక్కై ఔట్ సోర్సింగ్ వాళ్లకు, ప్రైవేట్ హాస్పిటళ్లలో పనిచేసేవాళ్లకు కూడా మార్కులు కలిపారు. ఇందుకోసం ఫోర్జరీ సర్టిఫికెట్లు కూడా సృష్టించారు. ఈ అవకతవకలపై పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రిపోర్ట్ ఇచ్చినా ఒక్కరిపై కూడా ప్రభుత్వం యాక్షన్ తీసుకోలేదు. ఉద్యోగాలు ఇప్పిస్తామని కోట్ల రూపాయలు వసూలు చేసిన వ్యక్తులు రిక్రూట్‌మెంట్‌ను ముందుకు కదలనీయకుండా అడ్డుకుంటున్నారని, హైలెవల్‌లో పైరవీలు చేస్తూ ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపణలున్నాయి.
బిచ్చగాళ్ల లెక్క చూస్తున్నరు
నవంబర్ ఫస్ట్ వీక్‌లో మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు నోటిఫికేషన్ ఇచ్చిన్రు. సర్టిఫికెట్ల కోసం ప్రైవేట్ హాస్పిటళ్లలో ఉద్యోగాలు పోగొట్టుకున్నం. సర్టిఫికెట్లు తీసుకుని దగ్గర పెట్టుకునే సరికి, వెరిఫికేషన్ వాయిదా పడ్డది. ఇప్పుడు 3 నెలలైతున్నా రివైజ్‌డ్ మెరిట్ లిస్ట్ ఇస్తలేరు. ఎప్పుడు ఇస్తరని కమిటీ వాళ్లను అడిగితే కనీసం మర్యాద లేకుండా మాట్లాడుతున్నరు. మూడేండ్ల నుంచి మాది ఇదే గోస. అందుకే ధర్నా చేసినం. ప్రభుత్వ పట్టింపులేనితనంతో మా బతుకులు బిచ్చగాళ్ల లెక్క తయారైనయ్.
– కురుమేటి గోవర్ధన్, మేల్ నర్స్
For More News..
సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు ఇప్పించాలె
హోం ట్యూషన్లకు ఫుల్ డిమాండ్.. నెలకు రూ. 3 నుంచి 15 వేలు
V6 రేటింగ్‌పై కుట్ర.. రేటింగ్ పెరగకుండా ప్రయత్నాలు