నర్సింగ్ కాలేజీలో డ్రైనేజీ కంపు

నర్సింగ్ కాలేజీలో డ్రైనేజీ కంపు
  • సమస్యను పరిష్కరించాలంటూ విద్యార్థుల ఆందోళన

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్​లో నర్సింగ్ విద్యార్థినులు గురువారం ఆందోళనకు దిగారు. బోయిగూడలోని తమ హాస్టల్​లో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని, మురుగు పొంగి గదుల్లోకి ప్రవహిస్తోందని దాదాపు 150 మంది విద్యార్థినులు 3 గంటలపాటు నిరసన వ్యక్తం చేశారు. కంపుతో హాస్టల్​లో ఉండలేక పోతున్నామని, సొంతూరికి వెళ్లిపోతామంటే కాలేజీ ప్రిన్సిపల్ అంగీకరించడం లేదన్నారు. సమస్యపై ఫిర్యాదు చేసి రోజులు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవట్లేదన్నారు.  

టాయిలెట్స్​కు తాళాలు..

బోయిగూడలోని సికింద్రాబాద్ ప్రభుత్వ నర్సింగ్​కాలేజీ, గాంధీ నర్సింగ్​ స్కూల్​భవనాలకు సంబంధించి కామన్ టాయిలెట్స్​లో ఇటీవల డ్రైనేజీ బ్లాక్ అయ్యింది. మూడు రోజులుగా మురుగు వసతి గదుల్లోకి వస్తుండడంతో టాయిలెట్స్​కు సిబ్బంది తాళాలు వేశారు. మరోవైపు అధికారుల సూచనతో 300 మంది సికింద్రాబాద్ నర్సింగ్​ కాలేజీ విద్యార్థినులు హాస్టల్​భవనం విడిచి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నారు.

మిగిలిన 150 మంది గాంధీ నర్సింగ్ ​స్కూల్​విద్యార్థినులకు ఒకటి, రెండు టాయిలెట్స్ కేటాయించారు. అయినప్పటికీ సమస్య తీరకపోవడంతో​ నానా ఇబ్బందులు పడుతున్న వారంతా గురువారం గాంధీ ఆసుపత్రికి వచ్చి ఆందోళన నిర్వహించారు. వీరిని హాస్పిటల్ ​సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అనంతరం సూపరింటెండెంట్​ ప్రొఫెసర్ ​రాజకుమారిని కలిసి, తమ సమస్యను మొరపెట్టుకున్నారు.

డ్రైనేజీ సమస్య తీరేవరకు హాస్పిటల్ ​మెయిన్ బిల్డింగ్ 8వ ఫ్లోర్​లో ​తాత్కాలికంగా గదులను కేటాయిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ మేరకు సిబ్బంది గదులను శుభ్రం చేస్తున్నారు. ఈ గదులను శుక్రవారం నర్సింగ్ స్టూడెంట్స్​కు ఇవ్వనున్నారు.  మరో 10 రోజుల్లో పరీక్షలు ఉన్నందున సెలవులు ఇవ్వలేమని, విద్యార్థులు ఎగ్జామ్స్​పై దృష్టి పెట్టాలని సూపరింటెండెంట్​ సూచించారు.