కాలేజీ యాజమాన్యం వేధిస్తోందని .. నర్సింగ్‌‌‌‌ స్టూడెంట్‌‌‌‌ ఆత్మహత్యాయత్నం

కాలేజీ యాజమాన్యం వేధిస్తోందని .. నర్సింగ్‌‌‌‌ స్టూడెంట్‌‌‌‌ ఆత్మహత్యాయత్నం
  • ఫీజుల కోసం కాలేజీ యాజమాన్యం వేధిస్తోందని ఆరోపణ
  • ఐదు రోజుల వ్యవధిలోనే రెండోసారి ఆత్మహత్యకు యత్నించిన విద్యార్థిని

సూర్యాపేట, వెలుగు : ఫీజుల కోసం కాలేజీ యాజమాన్యం వేధిస్తోందంటూ ఓ నర్సింగ్‌‌‌‌ స్టూడెంట్‌‌‌‌ వారం రోజుల్లోనే రెండోసారి ఆత్మహత్యకు యత్నించింది. గత నెల 28న ఆత్మహత్యాయత్నం చేసిన స్టూడెంట్‌‌‌‌ మూడు రోజులు ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ తీసుకుంది. సోమవారం సూర్యాపేటలో కలెక్టర్‌‌‌‌ను కలిసేందుకు వచ్చి మరోసారి ఆత్మహత్యకు యత్నించింది. వివరాల్లోకి వెళ్తే... కోదాడలోని స్నేహ నర్సింగ్‌‌‌‌ కాలేజీ యాజమాన్యం ఫీజుల కోసం వేధిస్తున్నారంటూ స్టూడెంట్లు సోమవారం కలెక్టర్‌‌‌‌ను కలిసేందుకు వచ్చారు. కలెక్టర్‌‌‌‌ అందుబాటులో లేకపోవడంతో సాయంత్రం వరకు వేచి చూశారు. 

కలెక్టర్‌‌‌‌ వచ్చాక ఆయనను కలిసి తమ సమస్యను విన్నవించారు. దీంతో స్పందించిన కలెక్టర్‌‌‌‌ ఈ విషయంపై ఎంక్వైరీ చేస్తామని, తిరిగి కాలేజీకి వెళ్లాలని సూచించారు. అయితే కాలేజీకి వెళ్లడం ఇష్టం లేకపోవడంతో అసోంకు చెందిన నర్గీస్‌‌‌‌ పర్విన్‌‌‌‌ కలెక్టరేట్‌‌‌‌లోని క్యాంటీన్‌‌‌‌కు వెళ్లి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన సిబ్బంది ఆమెను వెంటనే సూర్యాపేట జనరల్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌కు తరలించారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ తేజస్‌‌‌‌ నందలాల్‌‌‌‌ పవార్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌కు వచ్చి పర్వీన్‌‌‌‌ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. అయితే ఇదే విషయంపై పర్వీన్‌‌‌‌ గత నెల 28న సైతం ఆత్మహత్యకు యత్నించింది. నర్సింగ్‌‌‌‌ స్టూడెంట్‌‌‌‌ ఐదు రోజుల వ్యవధిలోనే రెండోసారి ఆత్మహత్యకు యత్నించడం చర్చనీయాంశమైంది.