బీసీ కార్పొరేషన్ చైర్మన్​గా శ్రీకాంత్ గౌడ్ బాధ్యతలు

  • గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా రాయల కూడా..

హైదరాబాద్, వెలుగు: బీసీ కార్పొరేషన్ చైర్మన్ గా నూతి శ్రీకాంత్ గౌడ్ బాధ్యతలు చేపట్టారు. గురువారం హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని సంక్షేమ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ మధుయాష్కీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. బీసీ శాఖ మంత్రిగా కార్పొరేషన్ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. 

గతంలో ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే హడావిడిగా బీసీ కార్పొరేషన్ కొనసాగుతుండేది. కానీ ఇప్పుడు నిరంతరాయంగా శిక్షణ , ఉపాధి కార్యక్రమాలు కొనసాగుతాయి. బలహీన వర్గాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తాం” అని తెలిపారు. కాగా, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా రాయల నాగేశ్వరరావు బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు.