- 2 నెలల కింద ‘కామారెడ్డి’లో స్కీమ్ ప్రారంభం
- ఎన్ని సార్లు అడిగినా స్టాక్ లేదని చెప్తున్న డాక్టర్లు
- త్వరగా ఇవ్వాలని గర్భిణుల డిమాండ్
కామారెడ్డి , వెలుగు: గర్భిణుల్లో రక్తహీనత సమస్యను నివారించి పుట్టే బిడ్డ, తల్లి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్ధేశ్యంతో ప్రభుత్వం ప్రారంభించిన ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్’ ప్రోగ్రామ్ రెండు నెలల్లోనే ఆపసోపాలు పడుతోంది. కిట్ల సప్లైలో డిలే జరుగుతుండడంతో గర్భిణులకు సకాలంలో అందడం లేదు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్సెంటర్లలో ఇప్పటికీ న్యూట్రిషన్కిట్లు ఇవ్వలేదని గర్భిణులు వాపోతున్నారు.
9 జిల్లాల్లో రక్తహీనత..
రాష్ర్టంలోని 9 జిల్లాల్లో గర్భిణులు ఎక్కువగా రక్తహీనత సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు గుర్తించారు. ఇందులో కామారెడ్డి, ఆదిలాబాద్, కుమ్రంభీం అసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాలు ఉన్నాయి. రక్తహీనత సమస్యను అధిగమించేందుకు ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్’ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కిట్‌లో కిలో న్యూట్రిషన్ పౌడర్, కిలో ఖర్జూర, 3 ఐరన్ సిరప్ బాటిల్స్, 500 గ్రాముల నెయ్యి, ఆల్బెండజోల్టాబ్లెట్స్, ఒక కప్పు, ప్లాస్టిక్బాస్కెట్ ఉంటాయి. కిట్ విలువ రూ. 1,962 వరకు ఉంటుంది. గర్భం దాల్చిన వారు ఏఎన్సీ, పీహెచ్‌సీల్లో పేరు నమోదు చేసుకున్న తర్వాత 14 నుంచి 27 వారాలకు ( 4 నుంచి 5 నెలల మధ్య) పీహెచ్సీలో ఫస్ట్కిట్ఇవ్వాలి. ఆ తర్వాత చెకప్ కోసం జిల్లా, సీహెచ్‌సీ, ఏరియా హాస్పిటల్‌కు వెళ్లినప్పుడు ( 28 నుంచి 34 వారాల మధ్య) 8 నుంచి 9 నెలల మధ్య సెకండ్ కిట్ఇవ్వాలి.
రెండు నెలల కింద ప్రారంభం..
2022 డిసెంబర్ 21న స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు, ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి న్యూట్రిషన్కిట్ల పంపిణీ స్కీమ్ కామారెడ్డి జిల్లాలో ప్రారంభించారు. ఇక్కడి నుంచి వర్చువల్సిస్టం ద్వారా మిగతా 8 జిల్లాల్లో కూడా ప్రారంభించారు. త్వరలోనే రాష్ర్ట వ్యాప్తంగా గర్భిణులకు కిట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
జిల్లాలో పరిస్థితి
జిల్లాలో 16 వేల మంది వరకు గర్భిణులు ఉన్నా రు. న్యూట్రిషన్ కిట్లను పీహెచ్సీ, జిల్లా, ఏరియా ఆస్పత్రులు, సీహెచ్‌సీల్లో పంచేందుకు ఉంచాలి. 5 నెలల వరకు పీహెచ్‌సీల్లో, రెండో విడత కిట్ జిల్లా, ఏరియా, సీహెచ్‌సీల్లో ఇవ్వాలి. ప్రస్తుతం జిల్లాలో కొద్ది రోజుల కింద 6,477 కిట్లు రాగా ఇందులో 4,522 పీహెచ్సీ స్థాయిల్లో పంపిణీ చేశారు. ఇక్కడ ఇంకా 1,955 స్టాక్ ఉన్నాయి. రెండో విడతలో ఇచ్చేందుకు 8 నుంచి 9 నెలల మధ్య ఉన్న వారికి ఇవ్వటానికి కిట్ల స్టాక్ లేదు. కామారెడ్డి జిల్లా హాస్పిటల్, బాన్స్వాడ ఏరియా హాస్పిటల్, ఎల్లారెడ్డి, గాంధారి , దోమకొండ సీహెచ్‌సీల్లో స్టాక్ లేదు. జిల్లా హాస్పిటల్‌కు వారంలో 3 రోజులు రెగ్యులర్ చెకప్ కోసం గర్భిణులు వందలాది మంది వస్తారు. ఎక్కువ మందికి 9 నెలలు వచ్చినప్పటికీ ఇంకా కిట్స్ఇవ్వడం లేదు. 8 నుంచి 9 నెలల మధ్య ఉన్న వాళ్లు సుమారుగా 2 వేల మంది వరకు ఉన్నారని ఆఫీసర్లు చెప్తున్నారు.
స్టాక్ లేదని చెప్పిన్రు..
ప్రస్తుతం నాకు 9 నెలలు. వారం కింద చెకప్ కోసం వచ్చిన ప్పుడు న్యూట్రిషన్ కిట్ స్టాక్ రాలేదని చెప్పిన్రు. మళ్లీ ఇప్పుడొస్తే అదే మాట చెప్తున్నరు. స్టాక్ వచ్చిన తర్వాత ఇస్తాం.. పొమ్మంటున్రు. - కవిత, కాచాపూర్
స్టాక్ వచ్చిన వెంటనే సప్లై చేస్తున్నాం
న్యూట్రిషన్ కిట్స్ పంపిణీలో ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. స్టాక్ వచ్చింది వచ్చినట్లుగా పీహెచ్‌సీలకు సప్లై చేస్తున్నాం. జిల్లా, ఏరియా హాస్పిటల్స్‌లో కిట్స్స్టాక్లేవు. స్టాక్ రాగానే గర్భిణులకు పంపిణీ చేయిస్తాం. - శోభ, డిప్యూటీ డీఎంహెచ్‌వో, కామారెడ్డి
ఇంకా ఇవ్వలేదు
రెగ్యులర్ చెకప్ కోసం జిల్లా హాస్పిటల్‌కు వస్తున్నాం. ఇంకా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ఇవ్వలేదు. డాక్టర్లు కిట్ వాడడం వల్ల ఎంతో మేలని చెప్తున్నారు. త్వరగా కిట్ ఇస్తే బాగుండు. - సుజాత, గుండారం