కాంగ్రెస్‌‌కు ఓటేస్తే కష్టాలు తెచ్చుకున్నట్లే

  •     ఈనెల 14  నుంచి గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు
  •     ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు 

పాపన్నపేట,వెలుగు: కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కష్టాలు కొనితెచ్చుకున్నట్లే ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సోమవారం ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డితో కలిసి పాపన్నపేట మండలం రామతీర్థం గ్రామంలో రూ. 3.85 కోట్లతో నిర్మించిన 56  డబుల్ బెడ్ రూమ్‌‌ ఇండ్లను  ప్రారంభించి.. లబ్ధిదారులకు ఇంటి పట్టా సర్టిఫికెట్లు అందజేశారు. అలాగే ఏడుపాయలలో రూ. 42 లక్షలతో నిర్మించిన యాగశాల, పాపన్నపేటలో రూ.35 లక్షలతో నిర్మించిన వెటర్నరీ హాస్పిటల్, లింగాయపల్లిలో రూ.30 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనాన్ని ప్రారంభించి.. పాపన్నపేటలో రూ.1.20 లక్షల సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు.  కొల్చారం జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ 40 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ హయాంలో కరెంట్ కష్టాలు రైతులను కన్నీళ్లు పెట్టించాయన్నారు.  ఎరువులు, విత్తనాల కోసం రోడ్డు ఎక్కని రోజు లేదని,  ఇల్లు కట్టాలన్నా, పెళ్లి చేయాలన్నా.. అప్పు చేయాల్సి వచ్చేదన్నారు.  కానీ, సీఎం కేసీఆర్‌‌‌‌ రూపాయి ఖర్చు లేకుండా డబుల్ బెడ్ రూమ్‌‌ ఇండ్లు కట్టించి ఇస్తున్నారని, రైతుబంధుతో పెట్టుబడి, కల్యాణ లక్ష్మితో పెళ్లికి సాయం చేస్తున్నారని చెప్పారు. సొంత స్థలం ఉన్న వారికి ‘గృహ లక్ష్మి’ పథకం కింద రూ. 3 లక్షలు ఇవ్వనున్నామని తెలిపారు. ఈనెల 14 నుంచి గర్భిణిలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేస్తామని వెల్లడించారు.

 మీటర్లు పెడితేనే డబ్బులు ఇస్తామన్న కేంద్రం

ఎమ్మెల్యే పద్మాదేవెందర్​రెడ్డి మాట్లాడుతూ బోర్లకాడ మీటర్లు పెడితేనే రాష్ట్రానికి రావాల్సిన రూ.30 వేల కోట్లు ఇస్తామని కేంద్రం షరతు పెట్టిందని మండిపడ్డారు. రైతులు నష్టపోవద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌‌‌‌ దీనికి ఒప్పుకోలేదని చెప్పారు. సీఎం కేసీఆర్‌‌‌‌ అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. స్త్రీ శిశు సంక్షేమ కమిషన్ చైర్మన్ సునీతా రెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి, కలెక్టర్​ రాజర్షీ షా, అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్​రెడ్డి, వైస్ ఎంపీపీ విష్ణు వర్ధన్ రెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ఏడుపాయల మాజీ చైర్మన్ బాలాగౌడ్, విష్ణువర్ధన్​రెడ్డి, సర్పంచ్‌‌లు జగన్, గురుమూర్తి, లక్ష్మి, నవీన్, లింగారెడ్డి, వెంకటరాములు, బాబాగౌడ్, ఆంటోని, సాయిరెడ్డి, ఈశ్వరప్ప, దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.