ఎస్‌‌ఎల్‌‌బీసీ రెస్క్యూ ఆపరేషన్‌‌లోకి రోబోలు !

ఎస్‌‌ఎల్‌‌బీసీ రెస్క్యూ ఆపరేషన్‌‌లోకి రోబోలు !
  • టన్నెల్‌‌లోకి హైదరాబాద్‌‌కు చెందిన ఎన్‌‌వీ రోబోటిక్స్‌‌ ప్రతినిధుల బృందం
  • మనుషులు వెళ్లలేని చోటులో తవ్వకాలకు చాన్స్‌‌
  • వాటర్‌‌ జెట్ల ద్వారా టీబీఎంపై మట్టి, బురద తొలగిస్తున్న ఎన్‌‌డీఆర్‌‌ఎఫ్‌‌
  • ఢిల్లీ నుంచి నేషనల్‌‌ సెంటర్‌‌ ఫర్‌‌ సిస్మాలజీ ప్రతినిధుల టీమ్‌‌
  • సొరంగం పరిస్థితిపై అంచనా వేసే అవకాశం

ఎస్‌‌ఎల్‌‌బీసీ నుంచి వెలుగు టీం : ఎస్‌‌ఎల్‌‌బీసీ టన్నెల్‌‌లోకి రోబోలను పంపించే ప్రయత్నం జరుగుతోంది. రెస్క్యూ ఆపరేషన్‌‌కు అవసరమైతే రోబోలను వాడాలని సీఎం అనుముల రేవంత్‌‌రెడ్డి ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేయడంతో బుధవారం హైదరాబాద్‌‌కు చెందిన ఎన్‌‌వీ.రోబోటిక్స్‌‌ ప్రతినిధుల టీమ్‌‌ టన్నెల్‌‌ వద్దకు చేరుకుంది. ఉదయం టన్నెల్‌‌లోకి వెళ్లిన టీమ్‌‌ సభ్యులు అక్కడి పరిస్థితులను పరిశీలించారు. మనుషులు వెళ్ల లేని ప్రాంతానికి రోబోలను పంపించి, వాటి ద్వారా మట్టిని తవ్వించే ప్రయత్నాలపై అధ్యయనం చేశారు. తాము పరిశీలించిన అంశాలు, రోబోలను పంపే సాధ్యాసాధ్యాలపై రిపోర్ట్‌‌ను రెడీ చేసి ప్రభుత్వానికి అందించనున్నారు. ఈ రిపోర్ట్‌‌ ఆధారంగా ప్రభుత్వం టన్నెల్‌‌లోకి రోబోలను పంపించే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

మట్టి నమూనాలు సేకరించిన సిస్మాలజీ టీమ్‌‌

ఢిల్లీకి చెందిన నేషనల్‌‌ సెంటర్‌‌ ఫర్‌‌ సిస్మాలజీ టీమ్‌‌ సభ్యులు సైతం బుధవారం ఎస్‌‌ఎల్‌‌బీసీ వద్దకు చేరుకున్నారు. టన్నెల్‌‌ లోపల టీబీఎం ద్వారా తవ్వకాలు జరిపిన 13.600 కిలోమీటరు నుంచి 13.900 కిలోమీటర్‌‌ వరకు ఉన్న మట్టి నమూనాలను సేకరించారు. అలాగే టన్నెల్‌‌ లోపల, భూ ఉపరితలంపై ఎన్‌‌జీఆర్‌‌ఐ అన్వేషణ కొనసాగుతోంది. లక్నో, హైదరాబాద్‌‌ కేంద్రాలకు చెందిన జియాలజికల్‌‌ సర్వే ఆఫ్‌‌ ఇండియా డైరెక్టర్లు ప్రసాద్‌‌ తప్లియాల్, శైలేంద్రకుమార్‌‌ ఆధ్వర్యంలోని టీమ్‌‌లు టన్నెల్‌‌ పరిసరాలను పరిశీలించాయి.

13.2 కిలోమీటర్ల వరకు లోకో

టన్నెల్‌‌లో బురద, మట్టి కారణంగా 11వ కిలోమీటరు వద్దకే వెళ్తున్న లోకో తాజాగా 13.2 కిలోమీటర్ల వరకు వెళ్తోంది. రెస్క్యూ టీమ్‌‌లు ఎప్పటికప్పుడు డీవాటరింగ్, డీసిల్టింగ్‌‌ చేస్తూ లోకో ట్రాక్‌‌ను క్లియర్‌‌ చేస్తున్నాయి. మరో 300 మీటర్ల వరకు ట్రాక్‌‌ను క్లియర్‌‌ చేస్తే సహాయక చర్యల్లో మరింత వేగం పెరిగే అవకాశం ఉంది. సౌత్‌‌ సెంట్రల్‌‌ రైల్వేకు చెందిన టీమ్‌‌ ప్లాస్మా కట్టర్లు, గ్యాస్‌‌ కట్టర్లతో టీబీఎం వెనుక భాగంలో శిథిలాలను తొలగిస్తుండగా, వాటిని లోకో ద్వారా బయటకు తీసుకొస్తున్నారు. నీటి ఊట ఉధృతి కారణంగా టన్నెల్‌‌లోని 13వ కిలోమీటర్‌‌ నుంచి 14వ కిలోమీటర్‌‌ వరకు నాలుగు వరుసల్లో ఉన్న సిమెంట్‌‌ సెగ్మెంట్లు కూలే ప్రమాదం ఉందని రెస్క్యూ టీమ్‌‌లు గుర్తించాయి.

మళ్లీ నిలిచిపోయిన కన్వేయర్‌‌ బెల్ట్‌‌

మంగళవారం మధ్యాహ్నం నుంచి అందుబాటులోకి వచ్చిన కన్వేయర్‌‌ బెల్ట్‌‌ టెక్నికల్‌‌ ప్రాబ్లమ్‌‌తో బుధవారం ఆగిపోయింది. దీనిని తిరిగి రన్‌‌ చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గురువారం ఉదయం వరకు కన్వెయర్‌‌ బెల్ట్‌‌ను తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. అలాగే టన్నెల్‌‌ లోపల వెంటిలేషన్, లైటింగ్‌‌ వ్యవస్థను పొడిగించారు. 

టీబీఎంపై బురదను తొలగించేందుకు  వాటర్‌‌ జెట్‌‌

టన్నెల్‌‌ వద్దకు ఎన్‌‌డీఆర్‌‌ఎఫ్‌‌ టీమ్‌‌ తాజాగా వాటర్‌‌ జెట్‌‌ను తీసుకొచ్చింది. ముందుగా బయట ట్రయల్‌‌ చేసి పనితీరుని వివరించిన అనంతరం టన్నెల్‌‌లోకి తీసుకెళ్లారు. ఎస్‌‌ఎల్‌‌బీసీ టన్నెల్‌‌లో ప్రమాదం జరిగిన పాయింట్‌‌ వద్ద టీబీఎం ముందు భాగం బురద, మట్టి పేరుకుపోయింది. దీంతో వాటర్‌‌ జెట్‌‌ను ఉపయోగించి బురద, మట్టిని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. 

టన్నెల్‌‌ వద్ద నమూనా టీబీఎం

టన్నెల్‌‌ వద్ద జాతీయ సంస్థల ఆఫీసర్లు నమూనా టీబీఎంను ఏర్పాటు చేశారు. దీని పని తీరు గురించి అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, డిజాస్టర్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ స్పెషల్‌‌ చీఫ్‌‌ సెక్రటరీ అర్వింద్‌‌కుమార్‌‌, డైరెక్టర్‌‌ జనరల్‌‌ ఆఫ్‌‌ ఫైర్‌‌ సర్వీసెస్‌‌ డీజీ నాగిరెడ్డి, ఎస్పీడీసీఎల్‌‌ సీఎండీ ముషారఫ్‌‌ అలీ, నాగర్‌‌కర్నూల్‌‌ కలెక్టర్‌‌ బాదావత్‌‌ సంతోష్‌‌, ఎస్పీ గైక్వాడ్‌‌ రఘునాథ్‌‌కు వివరించారు. అనంతరం రెస్క్యూ ఆపరేషన్‌‌లో తాజా పురోగతిపై డిజాస్టర్ మేనేజ్‌‌మెంట్‌‌ స్పెషల్‌‌ చీఫ్‌‌ సెక్రటరీ, కలెక్టర్‌‌ ఉన్నతాధికారులతో రివ్యూ చేశారు.