భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఈ ఆర్థిక సంవత్సరంలో 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతున్నామని సింగరేణి డైరెక్టర్ఎన్వీకే శ్రీనివాస్ తెలిపారు. కొత్తగూడెంలోని ఇల్లెందు క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మంగళవారం నాటికి 65.41మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేశామని తెలిపారు.
కోల్ ట్రాన్స్‌పోర్టు టార్గెట్ ప్రకారంగా కొనసాగుతోందన్నారు. టీఎస్ జెన్కో, టీఎస్ ట్రాన్స్‌కోల ద్వారా సింగరేణికి దాదాపు రూ. 29వేల కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉందని చెప్పారు. సింగరేణిలోని పెద్దపల్లి, ఆర్జీ–1,2, భూపాలపల్లి ప్రాంతాల్లో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎడ్సీల్ సంస్థ ద్వారా సింగరేణిలో ప్రధానమైన నియామకాలకు సంబంధించి ఎగ్జామ్స్‌ను నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు.
1,359ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియ ఇప్పటికే మొదలైందన్నారు. గవర్నమెంట్ ఆదేశిస్తే బొగ్గు బ్లాక్‌ల వేలంలోనూ పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న 1400 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు 20 ఏండ్ల వరకు వస్తాయన్నారు. తాడిచర్ల కోల్ ప్రాజెక్ట్ సింగరేణికి వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. సమావేశంలో జీఎంలు కె. బసవయ్య, హనుమంతరావు, అధికారులు శ్రీనివాస్, వరప్రసాద్ పాల్గొన్నారు.