
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రో ఎండీగా ఎన్వీఎస్ రెడ్డి పదవి కాలాన్ని పొడిగించింది. ఏడాది పాటు ఆయన పదవి కాలాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఈ మేరకు బుధవారం (ఏప్రిల్ 9) ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. పదవీ విరమణ చేసి కాంట్రాక్టుపై పనిచేస్తున్న పలువురు సీనియర్ అధికారులు, ఉద్యోగులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
ఎన్వీఎస్ రెడ్డి కూడా ఎక్స్టెన్షన్ పైనే పని చేస్తున్నారు. దీంతో ఆయన కూడా పదవి నుంచి తప్పుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. కానీ.. హైద్రాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు సెకండ్ ఫేజ్ కీలక దశలో ఉన్నందున.. మెట్రో ప్రాజెక్టుపై పూర్తి అవగాహన కలిగిన ఎన్వీఎస్ రెడ్డి సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగానే ఎన్వీఎస్ రెడ్డి పదవి కాలాన్ని మరో ఏడాది పొడిగించింది. కాగా, మెట్రో రెండో దశ ప్రాజెక్టును రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే.
సెకండ్ ఫేజ్‌లో భాగంగా ఓల్డ్‌సిటీ, ఎయిర్‌పోర్టు, ఫోర్త్‌సిటీ, నార్త్‌సిటీ లాంటి ప్రాంతాలకు మెట్రో సర్వీసును విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. రెండో దశలో పార్ట్-ఏ కింద 5 కారిడార్లు, పార్ట్-బీ కింద 3 కారిడార్లను ప్రతిపాదించింది. ఈ క్రమంలోనే పార్ట్-ఏ లోని 5 కారిడార్లకు సంబంధించిన డిటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్)ను ఆమోదం కోసం 5 నెలల క్రితం కేంద్ర ప్రభుత్వానికి పంపింది స్టేట్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వం ఒకే చెబితే.. వెంటనే మెట్రో సెకండ్ ఫేజ్ పనులను ప్రారంభించేందుకు ప్రభుత్వం రెడీగా ఉంది.