ఫండ్స్ కామారెడ్డికేనా?
మిగిలిన సెగ్మెంట్లకు ఎందుకు ఇవ్వరు: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
హైదరాబాద్, వెలుగు : గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలకే నిధులు కేటాయిస్తూ.. మిగిలిన సెగ్మెంట్లను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు. ఇప్పటి దాకా మూడు నియోజకవర్గాలకే ఫండ్స్ కేటాయించేవాళ్లని.. తాజాగా అందులో కామారెడ్డి కూడా చేరిందన్నారు. మంగళవారం పార్టీ స్టేట్ ఆఫీస్ లో ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు.
కేవలం మూడు నియోజకవర్గాలు.. ఒక్క కుటుంబం అన్నట్లుగా కేసీఆర్ సర్కార్ వ్యవహరిస్తున్నదన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులపై గవర్నర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తే.. అధికార పార్టీ నేతలు ఎందుకు విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అమరుల కుటుంబాలు, కవులు, కళాకారులు, మేధావులు, రచయితలు ఉన్నా, వారిలో ఎమ్మెల్సీ పదవికి అర్హులే లేరా? అని ప్రశ్నించారు. కమీషన్ల కోసమే మూసీ బ్రిడ్జి నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారని ఆరోపించారు.