కుషాయిగూడ, వెలుగు : ప్రజల ప్రాణాలు తీసేందుకే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటికో బీరు.. వీధికో బార్ తెరిచిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు. ప్రధానిగా మోదీ 9 ఏండ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో గురువారం రాత్రి ఏఎస్రావు నగర్ గ్రౌండ్లో బీజేపీ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. చీఫ్ గెస్టుగా హాజరైన ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ.. మున్సిపల్ శాఖ అవినీతి ఊబిలో కూరుకుపోయిందని, 900 మంది కేసుల్లో ఇరుక్కున్నారని ఆరోపించారు.
జనాలు ఇండ్లు కట్టుకోవాలంటే బీఆర్ఎస్ నేతలకు కప్పం కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. డిసెంబర్ నాటికి చర్లపల్లి టెర్మినల్ పనులు పూర్తి చేసి ప్రారంభించుకునేలా రూ.250 కోట్ల నిధులు విడుదల చేసిన ఘనత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి దక్కిందన్నారు. జూపల్లి, పొంగులేటిని చూసి కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని ఆ పార్టీ నేతలు ముచ్చట పడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తులు, చేరికలు జనాలకు తెలుసన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీనేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.