![ఉన్నత విద్యాసంస్థల నాణ్యతపై.. న్యాక్ వైఖరి మారాలి](https://static.v6velugu.com/uploads/2025/02/nyac-an-autonomous-body-that-assesses-quality-of-higher-education-institutions-in-india_KdWiD2FkUT.jpg)
నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) భారతదేశంలోని ఉన్నత విద్యాసంస్థల నాణ్యతను అంచనా వేసే స్వయంప్రతిపత్తి గల సంస్థ. ఇది విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థల స్థాయిని మెరుగుపరిచేందుకు..1994లో జాతీయ విద్యావిధానం1986, కార్యాచరణ కార్యక్రమం 1992 సూచనలతో బెంగళూరులో ఏర్పడింది.
న్యాక్ అనేది బోధనను, అభ్యాసనను, పరిశోధనలను, ఆవిష్కరణలను, విస్తరణను, విద్యార్థుల ఫలితాలు, పురోగతిని, కళాశాల లేదా యూనివర్సిటీలో మౌలిక సదుపా యాలు, పరిపాలన, బోధనాభ్యాసాలకు ఉత్తమ విధానాలు, సమగ్ర అభివృద్ధికోసం సంస్థ ప్రయత్నాలను మూల్యాంకనం చేసి విద్యాసంస్థలకు ర్యాంకింగ్, గ్రేడింగ్ విధానాల ద్వారా వాటి స్థాయిని నిర్ణయిస్తుంది. న్యాక్ విద్యాసంస్థలను మూల్యాంకనం చేసేందుకు కొన్ని స్థిరమైన ప్రమాణాలను అవలంబిస్తోంది. అయితే, ఈ ప్రమాణాలు అన్ని రకాల విద్యా సంస్థలకు సమానంగా అన్వయించవు.
పట్టణాల్లో ఉన్న ప్రముఖ విశ్వవిద్యాలయాలు ఎక్కువ సదుపాయాలతో ముందుంటే, గ్రామీణ, జిల్లా ప్రాంతాల్లో ఉన్న కళాశాలలు, యూనివర్సిటీలు ఆ ప్రమాణాలను చేరుకోవడం కష్టం. న్యాక్ మూల్యాంకన ప్రక్రియలో ప్రధానంగా పర్యవేక్షకుల (పీర్ టీమ్ విజిట్) ఆధారంగా నివేదికలు తయారవుతాయి. అయితే, ఈ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండదనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని సంస్థలు తమ ప్రతిష్టను పెంచుకునేందుకు అక్రమ మార్గాలను అనుసరించడం జరుగుతోంది అని ఆరోపణలు ఉన్నాయి.
ఈ మధ్య కె.ఎల్. యూనివర్సిటీ న్యాక్ గ్రేడ్ కోసం యాజమాన్యం అనుసరించిన తీరు, తనిఖీ అధికారులపై వచ్చిన ఆరోపణలు వీటికి బలం చేకూరుస్తున్నాయి. న్యాక్ మూల్యాంకన సమయంలో చాలా విద్యాసంస్థలు తాత్కాలికంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరిచినట్లు చూపించి, అసలు పరిస్థితిని దాచిపెడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థులకు వాస్తవంగా లభించే విద్యా ప్రమాణాల కంటే, నివేదికలు ఆకర్షణీయంగా తయారు చేసే ధోరణి ఉందని బాహాటంగానే విద్యా నిపుణులు అంటున్నారు.
ర్యాంకింగ్ పొందలేకపోతున్న కొన్ని విద్యాసంస్థలు
న్యాక్ విద్యాసంస్థలను మూల్యాంకనం చేసే విధానం వార్షిక ప్రగతి నివేదికల ఆధారంగా సాగుతుంది. కానీ, ఈ నివేదికలు ఎక్కువగా సంబంధిత విద్యా సంస్థలే సిద్ధం చేసుకుంటున్న కారణంగా, వాటిలో నిష్పక్షపాతంగా నిజమైన సమాచారం ఉండకపోవచ్చు. ప్రభుత్వ రంగంలోని కొన్ని విద్యాసంస్థలు తక్కువ సౌకర్యాల కారణంగా న్యాక్ ర్యాంకింగ్‌లో మంచి గ్రేడ్ పొందలేకపోతున్నాయి.
కానీ, ప్రైవేట్ కళాశాలలు అధిక పెట్టుబడులతో తమ ఇమేజ్‌ను మెరుగుపరచి మంచి ర్యాంకులను పొందుతున్నాయి. కొన్ని కాలేజీలు తాత్కాలికంగా ఏర్పాట్లు చేసి, ఏదోరకంగా ప్రభావితం చేసి మంచి ర్యాంకు పొందుతున్నాయి. కానీ, ప్రభుత్వ విద్యాసంస్థలు నిధుల కొరత, కొంతమంది ఆచార్యుల నిరాసక్తత వలన అంత మంచి గ్రేడ్ పొందలేకపోతున్నాయి. న్యాక్ మూల్యాంకనంలో విద్యార్థుల అభిప్రాయాలకు తక్కువ ప్రాధాన్యత ఇస్తోంది.
అసలు విద్యార్థులకు ఉపయోగపడే విద్యా ప్రమాణాలను నేరుగా అంచనా వేసే అవకాశం లేకపోవడం పెద్ద లోపంగా భావించవచ్చు. పట్టణాల్లో ఉన్న విశ్వవిద్యాలయాలు ఎక్కువ సౌకర్యాలతో ముందుండటం వల్ల వాటికి ఎక్కువ ర్యాంకింగ్ లభిస్తోంది. అయితే, గ్రామీణ విద్యా సంస్థలు తక్కువ వనరులతో ఉన్నప్పటికీ, మంచి విద్యను అందిస్తున్నా న్యాక్ మూల్యాంకనంలో తక్కువ స్కోరు పొందే ప్రమాదం ఉంది.
పరిష్కార మార్గాలు
మూల్యాంకనంలో నిపుణుల బృందాలతో పాటు స్వతంత్ర సమీక్షకులను చేర్చాలి. విద్యార్థుల ఫీడ్‌బ్యాక్‌ను మూల్యాంకనంలో ముఖ్యమైన అంశంగా చేయాలి. విద్యార్థులతో న్యాక్ బృందం వ్యక్తిగతంగా మాట్లాడి విద్యాసంస్థ విషయాలను తెలుసుకోవాలి, వాటిని కళాశాల తయారు చేసిన నివేదికలతో సరి పోల్చుకోవాలి. తల్లిదండ్రుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి. పరీక్ష పేపర్ల మూల్యాంకనాన్ని పరిశీలించాలి.
పట్టణ, గ్రామీణ విద్యా సంస్థలకు వేర్వేరు మూల్యాంకన ప్రమాణాలను అమలు చేయాలి. కేవలం ఐదు సంవత్సరాలకు ఒకసారిగాను కాకుండా, నిరంతర అంచనా విధానం ద్వారా విద్యా ప్రమాణాలను క్రమంగా మెరుగుపరచాలి. తనిఖీకి వచ్చిన బృందంపై ఆరోపణలు వస్తే కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.
ALSO READ | ప్రభుత్వ బడుల్లో సాంకేతిక విద్య అనివార్యం
న్యాక్ భారత విద్యా వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగం అయినప్పటికీ, దాని మూల్యాంకన విధానాల్లో కొన్ని నష్టదాయక అంశాలు ఉన్నాయి. పూర్తిగా పారదర్శకత లేకపోవడం, విద్యార్థుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకపోవడం, గ్రామీణ కళాశాలలకు నష్టం కలిగేవిధంగా వ్యవస్థ ఉండటం వంటి లోపాలను అధిగమించాలి. చిత్తశుద్ధి, అంకితభావం ఉన్న, ఆరోపణలు లేని అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించాలి.
సమగ్ర అభివృద్ధికి అనుగుణంగా న్యాక్ విధానాలను మరింత కాలానుగుణంగా మెరుగుపరచాలి. భారతదేశ విద్యా వ్యవస్థలో దీని ప్రభావం మరింత మంచిగా ఉంటుంది. విద్యావ్యవస్థలలో మంచి నాణ్యత ఉంటే దేశకీర్తిని పెంచే భావి భారత పౌరులను తయారు చేయవచ్చు.
న్యాక్ అధికారులపై ఆరోపణలు
కొందరు న్యాక్ అధికారులు తనిఖీకి వచ్చిన సందర్భంలో యాజమాన్యాల అవసరాలను ఆసరాగా చేసుకుని గొంతెమ్మ కోరికలు కోరి వారిని ఇబ్బంది పెడతారని, వారి ఖర్చులు అన్ని భరించేలా, అవసరం అయితే కొన్ని సందర్భాల్లో వారు హామీలు తీసుకుంటారని, కొంత నగదు డిమాండ్ చేస్తారని బాహాటంగానే కళాశాల యాజమాన్యాలు గుసగుసలాడుతుంటాయి. ఇది కె.ఎల్. యూనివర్సిటీలో జరిగిన ఉదంతం బట్టబయలుచేసింది. ఇలాంటి కార్యక్రమాలకు కొంతమంది యూనివర్సిటీ మాజీ/ ప్రస్తుత పెద్దలు మధ్యవర్తిత్వం చేస్తారని బోగట్టా. అదేవిధంగా కొంతమంది మాజీ యూజీసీ మెంబర్లు, గతంలో యూనివర్సిటీలో ఉన్నత పదవుల్లో ఉండి పదవీ విరమణ పొందినవారు ,ప్రైవేట్ యూనివర్సిటీలు, కళాశాలల్లో వివిధ స్థాయిల్లో ఉండి పరోక్షంగా తనిఖీ అధికారులను ప్రభావితం చేస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి.
- మహేశ్వరం భాగ్యలక్ష్మి, అసిస్టెంట్ ప్రొఫెసర్