- అటెండ్ కానున్న లక్ష మంది విద్యార్థులు
- 3, 6, 9 క్లాసుల స్టూడెంట్లకు సామర్థ్యాలకు పరిశీలన
హైదరాబాద్, వెలుగు: సర్కారు, ప్రైవేటు బడుల్లో చదువుతున్న విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించేందుకు కేంద్ర విద్యాశాఖ ఈ నెల 4న నేషనల్ ఆచీవ్ మెంట్ సర్వే (న్యాస్) నిర్వహిస్తోంది. బుధవారం ఉదయం 10.30గంటలల నుంచి ఈ పరీక్ష ప్రారంభం కానున్నది. రాష్ట్రంలో ఈ పరీక్షను నిర్వహించేందుకు ఎస్సీఈఆర్టీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. స్టేట్లోని 3,342 బడుల్లో 3, 6, 9 తరగతులకు చెందిన సుమారు లక్ష మంది విద్యార్థులకు లాంగ్వేజ్ లు, సోషల్, మ్యాథ్స్ తదితర సబ్జెక్టులకు సంబంధించిన అంశాలపై వారి టాలెంట్ ను పరిశీలించనున్నారు.
ఒక్కో క్లాసు నుంచి సుమారు 30 మంది విద్యార్థులను మాత్రమే సర్వేకు తీసుకున్నారు. ఓఎంఆర్ బేస్డ్ గా ఈ పరీక్షలు నిర్వహిస్తారు. కాగా, ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు గానూ ఇప్పటికే బీఈడీ, డీఈడీ విద్యార్థులను ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లుగా (ఇన్విజిలేటర్లు) నియమించారు. ఎంఈఓలు, డీఈఓలు పరీక్షల నిర్వహణను పర్యవేక్షించనున్నారు. చివరగా 2021లో న్యాస్ సర్వే నిర్వహించగా, ప్రస్తుతం ఫర్మార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ రాష్ట్రీయ సర్వేక్షన్ (పరాస్) పేరుతో ఈ పరీక్షను నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా జరిగే ఈ పరీక్ష ద్వారా ఆయా రాష్ట్రాల్లోని విద్యార్థుల సామర్థ్యాలను కేంద్రం అంచనా వేస్తోంది. దీంతో, రాష్ట్రం ర్యాంకు బాగుండాలనే ఉద్దేశంతో ఇప్పటికే బడుల్లో మూడు సార్లు మాక్ టెస్టులు నిర్వహించారు. మోడల్ పేపర్లు, క్వశ్చన్ బ్యాంకులను రూపొందించి విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేశారు.