Cricket World Cup 2023: ఆఫ్ఘనిస్తాన్‌పై భారీ విజయం.. భారత్‌ను కిందకు నెట్టిన కివీస్

Cricket World Cup 2023: ఆఫ్ఘనిస్తాన్‌పై భారీ విజయం.. భారత్‌ను కిందకు నెట్టిన కివీస్

గత మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను చిత్తుచేసి అద్భుత విజయాన్ని అందుకున్న అఫ్గన్లు తదుపరి మ్యాచ్‌లోనే తేలిపోయారు. బుధవారం న్యూజిలాండ్‍తో జరిగిన మ్యాచ్‌లో 149 పరుగుల తేడాతో చిత్తుచిత్తుగా ఓడారు. ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టిన కివీస్.. మ్యాచ్‌ను ఏకపక్షంగా ముగించింది. ఈ విజయంతో న్యూజిలాండ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. 

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. టామ్ లథమ్(68), గ్లెన్ ఫిలిప్స్(71) విల్‌ యంగ్‌(54) హాఫ్ సెంచరీలు చేయగా.. రచిన్‌ రవీంద్ర(32), కాన్వే(20), చాప్ మెన్(25) పరుగులు చేశారు. ఆఫ్ఘన్ బౌలర్లలో నవీనుల్ హక్, అజ్మతుల్లా ఒమర్జాయ్ చెరో రెండు వికెట్లు తీసుకోగా.. రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

పోరాటాల్లేవ్..

అనంతరం 289 భారీ లక్ష్య ఛేదనలో అఫ్గాన్‌ బ్యాటర్లు కనీస పోరాటం కూడా చేయలేదు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూనే వచ్చింది. అఫ్గాన్‌ బ్యాటర్లలో 36 పరుగులు చేసిన రహ్మత్‌ షానే టాప్‌ స్కోరర్‌. గత మ్యాచ్‌తో పోలిస్తే ఆఫ్ఘన్ బ్యాటర్లలో గెలవాలన్న కసి ఎక్కడా కనిపించలేదు. త్వరగా పెవిలియన్ చేరాలన్న తాపత్రయమే వారిలో కనిపించింది. కివీస్‌ బౌలర్లలో శాంట్నర్‌, లాకీ ఫెర్గూసన్‌లు చెరో మూడు వికెట్లు తీయగా.. ట్రెంట్‌ బౌల్ట్ 2, హెన్రీ, రచిన్‌ రవీంద్రలకు చెరో వికెట్‌ దక్కింది. 

అగ్రస్థానం కివీస్‌దే

ఈ విజయంతో న్యూజిలాండ్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ఇప్పటివరకూ నాలుగు మ్యాచ్‌లు ఆడినా కివీస్ జట్టు అన్నింటా విజయం సాధించింది. ఇక మూడు విజయాలతో(3 మ్యాచ్ ల్లో) భారత జట్టు రెండో స్థానంలో ఉండగా..  మూడింట రెండు విజయాలతో దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.