ODI World Cup 2023: పాక్ ఆటగాళ్లకు షాకిచ్చిన ఐసీసీ.. భారీ జరిమానా

ODI World Cup 2023: పాక్ ఆటగాళ్లకు షాకిచ్చిన ఐసీసీ.. భారీ జరిమానా

అసలే సెమీస్ చేరతామో లేదో అన్న బాధతో ఉన్న పాకిస్తాన్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) మరో షాకిచ్చింది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్‌ కారణంగా పాక్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించింది. 

శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ నిర్ణీత సమయానికి రెండు ఓవర్లు తక్కువగా వేసింది. ఈ విషయాన్ని అంపైర్లు మ్యాచ్ రిఫరీ దృష్టికి తీసుకెళ్లగా.. ఐసీసీ ప్రవర్తనా నియామవళిలోని ఆర్టికల్ 2.22 నిబంధన ప్రకారం ఓవర్‌కు 5 శాతం చొప్పున ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించారు.

వర్షం..!

మొదట ర‌చిన్ ర‌వీంద్ర‌(108; 94బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్స్), కేన్ విలియ‌మ్స‌న్ (95; 79 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) రాణించడంతో న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 402 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనలో వర్షం పలు మార్లు అంతరాయం కలిగించడంతో డక్ వర్త్ లూయిస్ పధ్దతిలో పాకిస్తాన్‌ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆట నిలిచిపోయే సమయానికి ఫఖర్ జమాన్‌ (106 నాటౌట్; 69 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లు) బాబర్ అజామ్ (47*; 51 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) క్రీజులో ఉన్నారు.