NZ vs RSA: దక్షిణాఫ్రికా చేతిలో న్యూజిలాండ్ ఓటమి.. ఆసక్తి రేపుతోన్న సెమీస్ రేస్

NZ vs RSA: దక్షిణాఫ్రికా చేతిలో న్యూజిలాండ్ ఓటమి.. ఆసక్తి రేపుతోన్న సెమీస్ రేస్

టోర్నీ ఆరంభంలో వరుస విజయాలతో జోరు మీద కనిపించిన న్యూజిలాండ్ జట్టు.. చివరకు వచ్చేసరికి తడబడుతోంది. వరుసగా మూడో పరాజయాన్ని చవిచూసింది. గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కివీస్ 190 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. తొలుత సఫారీ జట్టు 357 పరుగుల భారీ స్కోరు చేయగా.. లక్ష్య ఛేదనలో కివీస్ 167 పరుగులకే కుప్పకూలింది. దీంతో సెమీస్ రేసు ఆసక్తికరంగా మారింది.

358 పరుగుల లక్ష్య ఛేదనలో కివీస్ బ్యాటర్లు ఆదిలోనే తడబడ్డారు. ఫామ్‌లో ఆ జట్టు టాఫార్దర్ బ్యాటర్లు డెవాన్ కాన్వే(2), విల్ యంగ్(33), రచిన్ రవీంద్ర(9) స్వల్ప పరుగులగే వెనుదిరిగారు. అక్కడినుండి కివీస్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూనే వచ్చింది. మిడిల్ ఆర్డర్‌లో గ్లెన్ ఫిలిప్స్(60; 50 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులు) ఒంటరి పోరాటం చేశాడు. డారిల్ మిచెల్(24), టామ్ లాథమ్(4) మరోసారి నిరాశపరిచారు. సఫారి బౌలర్లలో కేశవ్ మహరాజ్ 4 వికెట్లు పడగొట్టగా.. మార్కో జెన్‌సెన్ 3 వికెట్లు తీశాడు. 

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవరల్లో 4 వికెట్ల నష్టానికి 357 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. క్వింటన్ డికాక్ (114) ఈ టోర్నీలో నాలుగో సెంచరీ పూర్తిచేసుకోగా.. వాండ‌ర్ డ‌స్స‌న్(133) రెండో శతకాన్ని నమోదుచేశాడు. ఆఖరిలో డేవిడ్ మిల్లర్(53; 30 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులు) కూడా రాణించడంతో సఫారీ జట్టు భారీ స్కోర్ చేసింది.

సెమీస్ రేసులోకి పాక్, ఆఫ్ఘన్!

ప్రస్తుతం 7 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో న్యూజిలాండ్ నాలుగో స్థానంలో ఉండగా, 7 మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో పాకిస్తాన్ ఐదు, 6 మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో ఆఫ్ఘనిస్తాన్ ఆరో స్థానంలో ఉన్నాయి. విజయాల పరంగా  పెద్దగా తేడా లేకపోవడంతో ఈ జట్ల మధ్య సెమీస్ రేసు మరింత ఆసక్తికరంగా మారింది. తదుపరి రెండు మ్యాచ్‌ల్లో కివీస్ ఓటమి పాలై.. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అన్నింటా విజయం సాధిస్తే ఏ జట్టు సెమీస్ చేరుతుందనేది ఊహించడం కష్టం. సౌతాఫ్రికా చేతిలో భారీ తేడాతో ఓడటం న్యూజిలాండ్ రన్‌రేట్‌ను దెబ్బకొట్టింది.

ALSO READ :- ODI World Cup 2023: అండర్ కవర్ ఏజెంట్‌గా సూర్య.. కెమెరా చేత పట్టి మెరైన్ డ్రైవ్‌లో