- 18 సిరీస్‌ల జైత్రయాత్రకు బ్రేక్
- ఇండియాలో తొలిసారి సిరీస్ నెగ్గి న్యూజిలాండ్ కొత్త చరిత్ర
- రెండో టెస్టులో 113 రన్స్‌తో గెలుపు
- 2–0తో సిరీస్ సొంతం
పుణె : అచ్చొచ్చిన స్పిన్ ట్రాక్‌పై అద్భుతం చేస్తామని భావించిన టీమిండియా బొక్కబోర్లా పడింది. తాము పన్నిన ఉచ్చులో తామే చిక్కుకుని విలవిలలాడింది. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లు చెలరేగిన వికెట్‌పై మనోళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో.. మూడు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్ట్‌లో ఇండియా 113 రన్స్ తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా ఓడింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరోటి మిగిలి ఉండగానే కివీస్ 2–0తో సొంతం చేసుకుంది.
అలాగే ఇండియా గడ్డపై తొలి సిరీస్ విజయాన్ని రుచి చూసి చరిత్ర సృష్టించింది. 1955 నుంచి పోరాటం చేసినా కివీస్ ఎప్పుడూ సక్సెస్ కాలేదు. ఇక తాజా ఓటమితో టీమిండియా సొంతగడ్డపై వరుసగా సాధించిన 18 సిరీస్ విజయాలకు బ్రేక్ పడింది. దాంతో పాటు12 ఏండ్ల తర్వాత స్వదేశంలో తొలి సిరీస్‌ను చేజార్చుకున్న జట్టుగా రోహిత్‌సేన నిలిచింది. చివరగా 2012–13లో ఇంగ్లండ్‌కు సిరీస్ కోల్పోయింది.
జైస్వాల్ మినహా..
న్యూజిలాండ్ ఇచ్చిన 359 రన్స్ లక్ష్యాన్ని ఛేదించేందుకు శనివారం బరిలోకి దిగిన ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 60.2 ఓవర్లలో 245 రన్స్‌కు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (77), రవీంద్ర జడేజా (42) మెరుగ్గా ఆడారు. మిచెల్ శాంట్నర్ 6 వికెట్లతో మరోసారి ఇండియా ఇన్నింగ్స్‌ను శాసించాడు. అంతకుముందు 198/5 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 69.4 ఓవర్లలో 255 రన్స్ చేసింది.
టామ్ బ్లండెల్ (41), గ్లెన్ ఫిలిప్స్ (48) ఆరో వికెట్‌కు 48 రన్స్ జోడించారు. శాంట్నర్ (4), సౌథీ (0), ఎజాజ్ పటేల్ (1), ఒరూర్క్ (0) నిరాశపర్చారు. సుందర్ 4, జడేజా 3 వికెట్లు తీశారు. మొత్తం 13 వికెట్లు తీసిన శాంట్నర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు నవంబర్ 1 నుంచి వాంఖడేలో జరుగుతుంది.
శాంట్నర్ కాదు టర్నర్..
స్పిన్‌ను ఎదుర్కోవడంలో పేరొందిన ఇండియా స్టార్లకు శాంట్నర్ చుక్కలు చూపెట్టాడు. సిరీస్ సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఒక్క జైస్వాల్ మినహా మిగతా వారందరూ శాంట్నర్ అద్భుతమైన టర్నింగ్ బాల్స్ ఆడటంలో ఘోరంగా తడబడ్డారు. తొలుత ఇండియా బౌలర్లు మరో 57 రన్స్ తేడాతో కివీస్ చివరి ఐదు వికెట్లు పడగొట్టారు. దాంతో తొలి సెషన్‌లోనే ఇండియా ఛేజింగ్‌కు వచ్చింది. కానీ, మన బ్యాటర్లు చేజేతులా వికెట్లు పారేసుకున్నారు. రోహిత్ శర్మ (8) మరోసారి ఫెయిలైనా, జైస్వాల్, గిల్ (23) పోరాటంతో ఇండియా 81/1తో లంచ్‌కు వెళ్లింది.
ఆ తర్వాత శాంట్నర్ మరోసారి జోరు పెంచడంతో అసలు కథ మొదలైంది. గిల్‌ను ఔట్ చేసిన అతను రెండో వికెట్‌కు 62 రన్స్ పార్ట్‌నర్‌షిప్‌ను బ్రేక్ చేశాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ (17)తో తలెత్తిన సమన్వయ లోపంతో రిషబ్ పంత్ (0) రనౌటయ్యాడు. కోహ్లీ మరోసారి శాంట్నర్‌కే వికెట్ ఇచ్చుకోగా.. కొద్దిసేపటికే సర్ఫరాజ్ ఖాన్ (9), సుందర్ (21) పెవిలియన్‌కు వచ్చేశారు. దీంతో ఇండియా 97 రన్స్ తేడాలో ఆరు కీలక వికెట్లు కోల్పోయింది. చివర్లో జడేజా పోరాడినా అశ్విన్ (18), ఆకాశ్ దీప్ (1), బుమ్రా (10 నాటౌట్)ను కట్టడి చేసిన కివీస్ చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది.
1 ఇండియాలో న్యూజిలాండ్ టెస్టు సిరీస్ నెగ్గడం ఇదే తొలిసారి . 1955 నుంచి ఇప్పటి వరకు ఇండియాలో 13 సార్లు పర్యటిస్తే 12సార్లు ఓటమిపాలైంది.
3 ఒక క్యాలెండర్ ఏడాదిలో సొంతగడ్డపై ఇండియా మూడు అంతకంటే ఎక్కువ టెస్ట్‌లు ఓడటం ఇది మూడోసారి. 1969లో ఆసీస్ చేతిలో మూడు, కివీస్‌లో చేతిలో ఒకదాంట్లో ఓటమిపాలైంది. 1983లో విండీస్ చేతిలో మూడు మ్యాచ్‌ల్లో ఓడింది.
4 కెప్టెన్‌గా రోహిత్ స్వదేశంలో ఆడిన 15 టెస్టుల్లో నాలుగింటిలో ఓడాడు. పటౌడీతో సంయుక్తంగా రెండో ప్లేస్‌లో ఉన్నాడు. కపిల్ దేవ్, అజరుద్దీన్ చెరో 9 టెస్టుల్లో ఓడారు.
3 స్వదేశంలో ఒకే క్యాలెండర్ ఏడాదిలో వెయ్యికి పైగా రన్స్ చేసిన మూడో బ్యాటర్ జైస్వాల్ (1056). గుండప్ప విశ్వనాథ్ (1047), సునీల్ గావస్కర్ (1000+) ముందున్నారు. ఓవరాల్‌గా జైస్వాల్ ఆరో బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ : 259 ఆలౌట్, ఇండియా తొలి ఇన్నింగ్స్ : 156 ఆలౌట్, న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ : 69.4 ఓవర్లలో 255 ఆలౌట్ (టామ్ బ్లండెల్ 41, గ్లెన్ ఫిలిప్స్ 48 నాటౌట్, సుందర్ 4/56, జడేజా 3/72), ఇండియా రెండో ఇన్నింగ్స్ (టార్గెట్ 359) : 60.2 ఓవర్లలో 245 ఆలౌట్(జైస్వాల్ 77, జడేజా 42, శాంట్నర్ 6/104).