ఆర్కేపీ ఓసీపీలో కాంట్రాక్ట్​ కార్మికుల సమ్మె .. రెండు నెలల గుడ్​విల్, బోనస్​ఇవ్వాలని డిమాండ్​

ఆర్కేపీ ఓసీపీలో కాంట్రాక్ట్​ కార్మికుల సమ్మె .. రెండు నెలల గుడ్​విల్, బోనస్​ఇవ్వాలని డిమాండ్​
  • నిలిచి ఓబీ, బొగ్గు ఉత్పత్తి 

కోల్​బెల్ట్, వెలుగు:​ మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్​ సింగరేణి ఓపెన్ ​కాస్ట్​ గనిలో ఓబీ కాంట్రాక్ట్​ కార్మికులు వేతనాల కోసం సమ్మెకు దిగారు. మంగళవారం నైట్​ షిఫ్ట్ విధులు బహిష్కరించి మహాలక్ష్మి ఓబీ కాంట్రాక్ట్​కంపెనీ క్యాంపు వద్ద ఆందోళనకు దిగారు. కాంట్రాక్ట్​ కాలపరిమితి ముగుస్తున్న నేపథ్యంలో ఓబీ కాంట్రాక్టర్​ దశల వారీగా కార్మికులను తొలగిస్తున్నారు. సుమారు 300 మంది కార్మికులను అక్టోబర్ ​నెలాఖరు నుంచి తొలగిస్తున్నట్లు మంగళవారం నోటీసు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కార్మికులు సమ్మెకు దిగారు. 

ఓబీ కాంట్రాక్ట్​ కంపెనీలో నాలుగేండ్లుగా పనిచేస్తున్నామని.. గుడ్​విల్​గా రెండు నెలల జీతం, పండుగ బోనస్​గా ఒక నెల వేతనం ఇవ్వాలని కాంట్రాక్ట్​డ్రైవర్లు డిమాండ్ చేశారు. ఆర్థిక సంవత్సరం ముగియకుండానే తమను మధ్యలో తొలగించడం ద్వారా ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతామని ఆవేదన వ్యక్తంచేశారు. తమ డిమాండ్లు పరిష్కరించేంతవరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. 

విషయం తెలుసుకున్న సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ లీడర్లు అక్బర్​అలీ, వంగ రాజేశ్వర్​రావు, కాంగ్రెస్​లీడర్ గాండ్ల సమ్మయ్య క్యాంపు ఆఫీస్​కు చేరుకొని కార్మికులకు మద్దతు తెలిపారు. కార్మికులు సమ్మెకి దిగడంతో మంగళవారం రాత్రి షిప్టు నుంచి బొగ్గు ఉత్పత్తి, ఓబీ వెలికితీత పనులు నిలిచిపోయాయి. మూడు షిప్టులకు గాను సుమారు 5 వేల టన్నులు బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లగా 80వేల క్యూబిక్​మీటర్ల ఓబీ వెలికితీత పనులకు ఆటంకం ఏర్పడింది.