బీసీ కుల గణన చేయకపోతే కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటాం..

బీసీ కుల గణన చేయకపోతే కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటాం..

సామాజిక అసమానతలను తొలిగించాలంటే కుల గణన చాలా అవసరమని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి తెలిపారు. ప్రజలకు మంచి చేయడానికి, సామాజిక న్యాయం కోసం కుల గణన అత్యవసరమని, కుల గణన కోసం ఎంతో మంది ప్రాణాలు వదిలారు. వారి త్యాగాలను వృధా చేయకుండా ఉండడం కోసమే తమ పోరాటమని ఆయన అన్నారు. బీసీ కుల గణన చేపట్టకుంటే కేంద్రంలోని బీజేపీ సర్కారుతో తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించారు.

ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కుల గణన పై సత్యాగ్రహం  ఏర్పాటు చేయడం జరిగింది. ఆలిండియా ఓబీసీ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు కిరణ్ కుమార్... రాష్ట్ర అధ్యక్షుడు  శివా ముదిరాజ్అధ్యక్షత వహించారు. బీసీల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్‌ కోసం, కుల గణన చేయాలని అనేక దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ బీసీ కుల గణన ఉద్యమాన్ని నీరుగారిచేందుకు బీఆర్ఎస్ కొత్త ఎత్తుగడ వేసిందని ఆరోపించారు. అగ్రవర్ణాలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కొట్టుకుంటున్నట్లు నటించి మీడియాను డైవర్ట్ చేశారని ఆరోపించారు.  

కులగణన  విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు. డాక్టర్ జుజ్జువరపు పూర్ణచందర్రావు (రిటైర్డ్ ఐపీఎస్)బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్  చిరంజీవి (మాజీ ఐఏఎస్), ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, డాక్టర్ అనిల్ జైహింద్ తదితరులు మాట్లాడుతూ దామాషా ప్రకారం రిజర్వేషన్ వర్తింపజేయాలని లేని పక్షంలో ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. 50 ఏళ్ల క్రితం బీసీ కుల గణన  చేశారని .. ఆ తర్వాత పాలకులు చేపట్టకపోవడం విచారకరమన్నారు. 

1931 జనాభా లెక్కల ప్రకారం ఓబీసీ ల జనాభా 54% గా మండల్ కమిషన్ పేర్కొంది. ఇప్పుడు ఆ శాతం మరింత పెరిగింది. ప్రస్తుతం  లెక్కలు తీస్తే ఓబీసీ జనాభా 60 శాతం దాటొచ్చు. దానికనుగుణంగా అన్ని రంగాల్లో ప్రాతినిథ్యం  పెరగాలి. అప్పుడే రాబోయే తరాలకు మంచి జరుగుతుందని దుండ్ర కుమారస్వామి అభిప్రాయపడ్డారు. కులం గణన జరిగినప్పుడు మాత్రమే ఆయా కులాల్లో ఉన్న విద్యా, వుద్యోగ, ఆర్థిక, సామాజిక, స్థితి గతులు ఎలా ఉన్నాయో తెలుస్తుందన్నారు దుండ్ర కుమారస్వామి. 

ALSO READ : మహిళల్ని కించపరిచాడని అభినందించావా కేటీఆర్ ..;ప్రభుత్వ విప్ ఆది

అత్యంత పేదరికంలో మగ్గుతున్న బీసీలు ఉన్నారు. వారికి ఎలాంటి మంచి చేస్తోందో ప్రభుత్వం ఓసారి ఆలోచించుకోవాలి. వారు బాగు పడడానికి ఎలాంటి  ప్రణాళికలు అవసరమో ఆలోచించాలి.  కేంద్రంలో బీసీ సంక్షేమం కోసం కనీసం మంత్రిత్వ శాఖ కూడా లేదన్నారు.   కేంద్ర ప్రభుత్వం  బీసీల వ్యతిరేకి... అంటూ,,  బీసీలకు వ్యతిరేకంగా ఎన్నో నిర్ణయాలు తీసుకుంది. వెన్నుపోటు కు కేరాఫ్ గా బీజేపీ నిలిచిందని ధ్వజమెత్తారు.