భారత రాజ్యాంగానికి 2019లో103వ సవరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించింది. దీనివల్ల ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి జాతీయ విద్యాసంస్థల్లో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. ప్రభుత్వం వారి వార్షిక ఆదాయాన్ని 8 లక్షలుగా నిర్ణయించింది. ఇదంతా కూడా ఎలాంటి శాస్త్రీయత లేకుండా, చట్టాలను అతిక్రమిస్తూ చేసిన సవరణ. ఈ సవరణ న్యాయబద్ధతను సవాలు చేస్తూ జనహిత అభియాన్ అనే స్వచ్ఛంద సంస్థ కోర్టులో సవాలు చేసింది. కేవలం ఆర్థిక పరిస్థితి ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వొచ్చనేది రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఎం.ఆర్.బాలాజీ, ఇందిరా సహాని కేసులో రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదనే తీర్పు ఉంది. ఆర్థికంగా వెనుకబడిన సమూహంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చోటు లేకపోవడం కులవివక్ష అంటూ ఈ స్వచ్ఛంద సంస్థ కోర్టును ఆశ్రయించింది. అయితే ఈ సవరణ సబబే అంటూ సోమవారం సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల బెంచ్3:2 తేడాతో ఆమోదం తెలుపుతూ తీర్పునిచ్చింది.
3 % వారికి 10 % రిజర్వేషన్లా?
కాకా కాలేల్కర్ కమిటీ, మండల్ కమిషన్, వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన బీసీ కమిషన్లు అన్నీ బీసీలు/ఓబీసీల జనాభా 52–-55 శాతంగా నిర్ధారించాయి. చట్ట ప్రకారం జనాభా లెక్కల్లో ఎస్సీ, ఎస్టీల వివరాలు సేకరిస్తున్నారు. అందులో నిర్ధారించిన వారి జనాభాకు అనుగుణంగా వరుసగా 15 శాతం, 7.5 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సమూహంలో వీళ్లను మినహాయించారు. అంటే 55 +15 + 7.5 కలిపితే 77.5 శాతం. మిగిలిన 22.5 వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ 22.5 శాతంలో 15 శాతం ముస్లింలు ఉన్నారు. ఈ 15 శాతం ముస్లింలలో 2019 నుంచి ఇప్పటి వరకు 0.5 శాతం మంది కూడా విద్యా, ఉద్యోగావకాశాలు పొందలేక పోయారు. అంటే 7.5 శాతం మందికి(ఈడబ్ల్యుఎస్ నుంచి ముస్లింలని మినహాయిస్తే) 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సబబే అంటూ ఈ న్యాయమూర్తులు అన్యాయమైన తీర్పునిచ్చారు. ఈ ఏడున్నర శాతం ఈడబ్ల్యూఎస్ వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారు అంటే 8 లక్షల లోపు ఆదాయం ఉన్నవాళ్లు రెండున్నర శాతానికి మించి ఉండరు. దీనివల్ల తేలేదేమిటంటే మూడు శాతం వారికి పది శాతం రిజర్వేషన్లు అప్పనంగా దోచి పెట్టడమే!
40 శాతం కోటాకే పోటీ పడాలా?
కులాల వారీగా బీసీల లెక్కింపునకు పార్లమెంటులో హామీ ఇచ్చి వెనక్కి తగ్గిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు ఎలాంటి అధికారిక లెక్కలు లేకుండా ఆధిపత్య కులాలకు ఆస్తులతో పాటు విద్యా, ఉద్యోగాలు కూడా దోచి పెట్టే ప్రయత్నం చేస్తున్నది. నిజానికి 50 శాతం ఓపెన్ కోటాలో పోటీ పడాల్సిన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఇప్పుడు 40 శాతం కోటాలోనే పోటీపడాల్సి ఉంటుంది. జనాభాలో 55 శాతంగా ఉన్న ఓబీసీలకు కేవలం వారి జనాభాలో సగం మందికి 27 శాతం రిజర్వేషన్లు అమలు జేస్తున్నారు. అదీ క్రీమిలేయర్ లాంటి షరతుల మధ్య. 1993 నుంచి ఇప్పటి వరకు రిజర్వేషన్లు గంపగుత్తగా 50 శాతానికి మించకూడదంటూ ఎం.ఆర్.బాలాజీ, ఇందిరా సహానీల కేసులో సుప్రీం కోర్టు తీర్పులిచ్చింది. క్రీమీలేయర్ అమలు కారణంగా మిగిలిపోయిన ఉద్యోగాలను ఓపెన్ కోటాలోకి మళ్లించి బీసీలకు అన్యాయం చేశారు. ఉద్యోగాల అమలు అంతా ఆధిపత్య కులాల చేతుల్లోనే ఉంది కాబట్టి 1993 నుంచి ఇప్పటి వరకు దాదాపు 30 ఏండ్లుగా రైల్వేల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయి. రైల్వేలే ఎందుకంటే దేశంలో ప్రభుత్వ రంగంలో అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్నది ఆ సంస్థే. ఇప్పటికీ ఆ సంస్థలోని ఏ విభాగంలోనూ ఓబీసీ ఉద్యోగుల సంఖ్య ఏడున్నర శాతానికి మించి లేదు. అంటే అన్యాయం జరిగే తీరుని అర్థం చేసుకోవచ్చు.
ప్రజల్లో చైతన్యం పెరగాలి..
ఐదుగురు జడ్జిలు ఇచ్చిన తీర్పులో రిజర్వేషన్‌ను కంపార్ట్‌మెంట్‌లుగా విభజిస్తూ ఓబీసీలు, ఈడబ్ల్యూఎస్ అంటూ విడదీసి తమ సామాజిక వర్గాలకు మేలు చేసుకునే విధంగా తీర్పులిచ్చారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు గతంలో ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల అమలు చేయడం కుదరదంటూ తీర్పునిచ్చారు. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటు పరం అవుతున్నా ఈ న్యాయమూర్తులు ఎక్కడా జోక్యం చేసుకోరు. ఓబీసీల పొట్టకొడుతూ ఆధిపత్య కులాల వారికి అన్నీ దోచిపెట్టే ప్రభుత్వ పాలసీలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకు రావాల్సిన అవసరమున్నది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో కుల గణనకు అనుకూలంగా తీర్మానం చేసింది కాబట్టి, ఇందుకు తగ్గట్టుగా కార్యాచరణను చేపట్టి కులాల వారీగా జనాభా లెక్కింపునకు చర్యలు తీసుకోవాలి. అట్లాగే సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం సేకరించిన లెక్కలను బహిర్గతం చేయాలి.
-సంగిశెట్టి శ్రీనివాస్, ఫోరమ్ ఫర్ కన్సర్నడ్ బీసీస్