దేశం బాగుపడాలంటే కులగణన జరగాల్సిందే

దేశం బాగుపడాలంటే కులగణన జరగాల్సిందే
  • ఆల్ ఇండియా ఫెడరేషన్ ఫర్ సోషల్ జస్టిస్ సదస్సులో ఓబీసీ నేతలు

న్యూఢిల్లీ, వెలుగు: దేశం బాగుపడాలంటే కులగణన, సామాజిక న్యాయం అమలు ముఖ్యమని ఓబీసీ నేతలు అభిప్రాయపడ్డారు. మంగళవారం ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్ లో ఆల్ ఇండియా ఫెడరేషన్ ఫర్ సోషల్ జస్టిస్ 3వ జాతీయ సదస్సు జరిగింది. ఇందులో ‘కుల గణన, మహిళల హక్కులు, రిజర్వేషన్లు- సామాజిక న్యాయం మూల స్తంభాలు’ అనే అంశంపై జరిగిన చర్చలో ఎంపీలు, ఎమ్మెల్సీలు,  దేశవ్యాప్తంగా ఉన్న పలు బీసీ, ఓబీసీ ప్రతినిధులు పాల్గొని మాట్లాడారు. తెలంగాణ నుంచి ఎంపీ వద్ది రాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఇతర ఓబీసీ నేతలు హాజరయ్యారు. తెలంగాణలో బీసీలకు అన్యాయం జరుగుతున్నదని తీన్మార్ మల్లన్న అన్నారు. బీసీలకు చెందిన 10 వేల ఉద్యోగాలు ఈడబ్ల్యూఎస్  కోటాలో దోచుకున్నారని ఆరోపించారు. ఈడబ్ల్యూసీ కోటాలో ఉద్యోగాలు అక్రమంగా భర్తీ చేస్తున్నారని విమర్శించారు. 

జనాభాలో ఎవరివాటా వారికి దక్కాల్సిందే అని డిమాండ్ చేశారు.  కుల గణనలో ఓబీసీల కోసం ప్రత్యేక కాలమ్ పెట్టాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. అలాగే ఓబీసీలను ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వ ఏడాది సంబరాలను మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాలకు వెళ్లి జరుపుకోవాలని.. అక్కడే అసలు ప్రజా సమస్యలు తెలుస్తాయని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో కేవలం ఇద్దరే బీసీ మంత్రులు ఉన్నారని.. ఖాళీగా ఉన్న మంత్రిత్వ శాఖలను బీసీ, మైనార్టీలకు ఇవ్వాలని ఎంపీ వద్దిరాజు అన్నారు. అప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కులగణనలో బీసీ గణన జరగాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో జరుగుతున్న కులగణన పట్ల ప్రజలు భయాందోళనలో ఉన్నారని వ్యాఖ్యానించారు.