
- రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్రానికే ఉన్నదని కామెంట్
హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తున్నదని రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే.లక్ష్మణ్ అన్నారు. బీసీలను మోసం చేసే కుట్రలో భాగంగా ఢిల్లీలో ‘పోరు గర్జన’ పేరుతో డ్రామా ఆడుతున్నదని బుధవారం రిలీజ్ చేసిన ప్రెస్నోట్లో విమర్శించారు. బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చాలన్న కాంగ్రెస్ ప్రకటన మోసపూరితమని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(4), 16(4) ప్రకారం రిజర్వేషన్లను పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉన్నప్పటికీ, అనవసరంగా 9వ షెడ్యూల్‌ను లేవనెత్తి బీసీలను తప్పుదోవ పట్టిస్తున్నదని విమర్శించారు.
దెయ్యాలు వేదాలు వల్లించినట్టున్నది: బీజేపీ
బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా చేయడం.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రామారావు పటేల్ ప్రెస్నోట్లో పేర్కొన్నారు. ‘‘బీసీల అభివృద్ధికి కాంగ్రెస్ అడుగడుగునా అడ్డుపడింది. కాంగ్రెస్ ధర్నాను బీసీలు నమ్మే పరిస్థితి లేదు. బీసీల అభ్యున్నతికి మండల్ కమిషన్ చేసిన సిఫార్సులను రాజీవ్ గాంధీ వ్యతిరేకించారు. బీసీ వర్గానికి చెందినవాళ్లు దొంగలని రాహుల్ అన్నారు. రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రం మీద తోసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాకపోతే తప్పుకోవాలి’’అని విమర్శించారు.