డిమాండ్ల సాధనకు దేశవ్యాప్త ఆందోళనలు: ఓబీసీ నేషనల్ జేఏసీ

బషీర్ బాగ్, వెలుగు:  దేశంలోని  ఓబీసీల సమస్యలపై అన్ని రాష్ట్రాల ప్రజల్లో  చైతన్యం తీసుకువచ్చి 10 లక్షల మందితో ఢిల్లీలో  పెద్ద ఎత్తున ఆందోళనల కార్యక్రమాలు చేపడతామని ఓబీసీ నేషనల్ జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) ప్రకటించింది. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో జేఏసీ చైర్మన్ మహేశ్ యాదవ్, కన్వీనర్ వీజీఆర్ నారగోని, మాజీ మంత్రి సి.కృష్ణాయాదవ్, తదితరులు మాట్లాడారు. 

కులగణన జరిపించి చట్ట సభల్లో  ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు 50 శాతం సబ్ కోటా కల్పించాలన్నారు. స్థానిక సంస్థల్లో ఓబీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలని స్పష్టం చేశారు. తెలంగాణలో  సమగ్ర కుటుంబ సర్వే నివేదికను బయట పెట్టకుండా కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్  ప్రకటించిన  లిస్ట్ లో  23 మంది బీసీలు మాత్రమే ఉన్నారని.. అందులో ఒక్క బీసీ మహిళ కూడా లేదని తెలిపారు.