
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల భర్తీ కోసం సమర్థవంతమైన, వాస్తవిక ఆధార జవాబులు కలిగిన, నిష్పాక్షికమైన పారదర్శక పరీక్షా పద్ధతిని ప్రవేశపెట్టవలసిన అవసరం ఉంది. ఉద్యోగాల సాధన కోసం లక్షలాది మంది నిరుద్యోగులు పోటీ పరీక్షలు రాస్తున్నారు.
నూతనంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఒక దశాబ్దం తర్వాత గ్రూప్-1 ఉద్యోగాల ప్రకటన వెలువడింది. అనంతరం అనేక వివాదాల తర్వాత పరీక్షలు వ్యాసరూప రాత పద్ధతిలో నిర్వహించి చివరకు ఫలితాలను ప్రకటించడం జరిగింది. కానీ, సరైన ప్రతిభ గల అభ్యర్థులు ఎంపికయ్యారు అనే తృప్తిని ఆశావహులు కలిగి ఉన్నారా ! పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల మూల్యాంకన విషయములో న్యాయస్థానాల్లో అనేక రిట్ పిటిషన్లు దాఖలు కావడానికి దారి తీసింది. అయితే, ఇదే సమయంలో ప్రకటించిన గ్రూప్- 2, గ్రూప్ -3 పరీక్షల ఫలితాల్లో ఎంపికైనవాళ్లు, ఎంపిక కానివాళ్లు అందరు ప్రతిభావంతులు ఎంపికయ్యారని సంతోషం వ్యక్తం చేస్తున్నారనే విషయం గ్రహించాలి.
వ్యాసరూప రాత పరీక్షలో గరిష్ట స్థాయిలో తప్పులు జరిగి మొత్తం పరీక్షా విధానం మలినమై పోయింది. నిరుద్యోగులు ఎవరూ నమ్మేపరిస్థితి లేని వ్యవస్థ నుంచి అందరికీ ఆమోద యోగ్యమైన లక్ష్యాత్మక ప్రశ్నలతో కూడిన పరీక్షల విధానంలోకి తక్షణమే మారాలని బాధితులు అందరూ కోరుకుంటున్నారు. అభ్యర్థుల సామర్థ్యాలను త్వరితగతిన, పారదర్శకంగా, సమర్థవంతంగా అంచనా వేసే విధంగా రూపొందించబడ్డ లక్ష్యాత్మక ప్రశ్నలతో కూడిన పరీక్షలు నిర్వహించాలి. దీంతో ఆ పరీక్షలు సమయం, ఖర్చు, నిష్పాక్షికత వంటి అంశాలలో సంపూర్ణ న్యాయాన్ని పాటించగలవు. లక్ష్యాత్మక ప్రశ్నలతో కూడిన పరీక్షల ప్రయోజనాలను పరిశీలించి చూస్తే ఇవి అభ్యర్థుల జ్ఞానం, విశ్లేషణా సామర్థ్యం, నిర్ణయాధికారాన్ని పరీక్షించడానికి రూపొందించారు. శాస్త్రీయంగా ఆబ్జెక్టివ్ పరీక్షల విశ్వసనీయత చాలా ఎక్కువ. వీటి రూప కల్పన న్యాయమైన ప్రమాణాలతో తయారవుతుంది. ఒక అభ్యర్థి ఎన్నిసార్లు పరీక్ష రాసినా, సమర్థతతో సమానమైన ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. సమగ్రతను పాటిస్తూ, జాతి, లింగం, ప్రాంతం అనే విషయాలకు అతీతంగా ఉంటాయి. పోటీ పరీక్షలకు లక్షల సంఖ్యలో అభ్యర్థులు హాజరవుతున్న పరిస్థితిలో తగిన పరీక్షా పద్ధతులు ప్రభుత్వాలు అనుసరించాలి. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలి. తక్కువ సమయంలో ఫలితాలు ఇవ్వగల సామర్థ్యం ఆబ్జెక్టివ్ తరహా పరీక్షలు మాత్రమే కలిగి ఉంటాయి.
కంప్యూటర్ పరీక్షలతో సత్వర ఫలితాలు
కంప్యూటర్ ఆధారిత పరీక్షల వల్ల వెంటనే ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంటుంది. అభ్యర్థి గుర్తించిన జవాబులను నిష్పక్షపాతంగా పరీక్షా
పత్రాల మూల్యాంకనంలో వ్యక్తిగత అభిప్రాయాలకు అవకాశం లేకుండా ఉంటుంది. ఫలితాలు పూర్తిగా ప్రతిభ ఆధారంగా ఉంటాయి. సమయం, భారీ సంఖ్యలో పరీక్షల నిర్వహణలో ఆర్థిక వ్యయం తగ్గుతుంది. పేపర్ వృథా తగ్గి, పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది. రాత పూర్వక పరీక్షల్లో ప్రశ్నలు వివిధ రకాలుగా రావచ్చు, కానీ, ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నల పరీక్షల్లో సమానమైన ప్రశ్నలు అందరికీ ఉంటాయి. మారుతున్న నేటి యుగంలో కొత్త టెక్నాలజీ, ట్రెండ్స్ గురించి పరీక్షించడానికి ఆబ్జెక్టివ్ టెస్టులు సరైన మార్గం. రాత పరీక్షల్లో సమీక్షకుని అభిప్రాయం ఆధారంగా మార్కులు తగ్గిపోయే లేదా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సమాన అవకాశాలు లేని అభ్యర్థులకైనా, భిన్న భౌగోళిక, ఆర్థిక, సామాజిక పరిస్థితులు కలిగి ఉన్న ప్రాంతాల్లో సైతం పరీక్షలు నిర్వహించినా సమాన నాణ్యత ఉంటుంది. అన్ని భాషల్లో పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించగలం. భవిష్యత్తులో ఆబ్జెక్టివ్ తరహా టెస్టుల ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. ఆన్‌లైన్ పరీక్షల వల్ల రూల్-బేస్డ్ మూల్యాంకనం సమర్థవంతంగా జరుగుతుంది. ఆబ్జెక్టివ్ తరహా పరీక్షల విధానం న్యాయమైనది, సమర్థవంతమైనది. భవిష్యత్తులో పరీక్షలను మరింత పటిష్టంగా నిర్వహించే అవకాశాలు ఎక్కువ అని చెప్పాలి.
- డా. ఎర్రా నాగేంద్రబాబు,
జాయింట్ కలెక్టర్
(రిటైర్డ్)