- ఖమ్మం హోల్‌సేల్ కూరగాయల మార్కెట్లో లైసెన్స్‌దారుల సిండికేట్
- రూల్స్‌కు విరుద్ధంగ ప్రత్యేక రోజులు, ఖర్చుల పేరుతో వేలం
- వేలం దక్కించుకొని ఎక్కువ రేట్లకు అమ్ముతున్న వేలందారులు
- నెలకు మూడు, నాలుగు సార్లు వేలం
- ఆర్నెళ్లలో రూ.50 లక్షలకు పైగా జమచేసినట్లు ఆరోపణలు
ఖమ్మం, వెలుగు: ఖమ్మం హోల్ సేల్ కూరగాయల మార్కెట్లో వేలం దందాకు వ్యాపారులు తెరలేపారు. రూల్స్ కు విరుద్ధంగా లాభాల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. గతంలో సిండికేట్ గా మారి రేట్లు డిసైడ్ చేస్తూ వ్యాపారం నిర్వహించగా.. గత ఆర్నెళ్ల నుంచి మార్కెట్లో వేలం పాట నిర్వహిస్తున్నారు. వేలంలో ఎక్కువ రేటు పెట్టిన వారికి ఒక్కరోజు మొత్తం వ్యాపారాన్ని అప్పగిస్తున్నారు. మూడు, నాలుగు రోజుల ముందుగానే వేలం నిర్వహించి, ముందుగా డిసైడ్ అయిన ప్రకారం మిగిలిన వ్యాపారులందరూ ఆ రోజు మార్కెట్ కు రావడం లేదు. దీంతో ఆ రోజు మార్కెట్ కు ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి సరుకు తెప్పించడం, మార్కెట్ కు రైతులు తెచ్చిన సరుకు కొనడం, మళ్లీ ఆ సరుకును ఇతర జిల్లాల నుంచి, చుట్టు పక్కల పట్టణాల నుంచి వచ్చే రిటైల్వ్యాపారులకు అమ్మడం సహా మొత్తం వ్యాపారాన్ని వేలం దక్కించుకున్న వారే నిర్వహిస్తున్నారు. దీంతో ఆ రోజుకు మార్కెట్లో సదరు వేలందారు నిర్ణయించిన రేటే ఫైనల్. ఆ రోజు రెగ్యులర్ రేట్ల కంటే రెట్టింపు ధరకు కూరగాయలను అమ్ముతున్నారు. ఆ మొత్తం భారం చివరకు కూరగాయలు కొనే సామాన్యులపై పడుతోంది.
రూ.4లక్షల నుంచి రూ.5లక్షల వరకు వేలం..
ఖమ్మం నగరంలో డీఆర్డీఏ ఆఫీస్ పక్కనున్న హోల్‌సేల్ కూరగాయల మార్కెట్లో 54 మంది కమిషన్ ఏజెంట్లు, వ్యాపారులున్నారు. వీరంతా ఇతర ప్రాంతాల నుంచి, రైతులు తీసుకువచ్చిన కూరగాయలను కమీషన్ తో అమ్మించడం చేస్తున్నారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు ఇక్కడ వ్యాపారం నడుస్తుంది. దీన్ని ఆనుకొని ఉన్న రిటైల్మార్కెట్లో 250 మంది రిటైల్ కేంద్రాల ద్వారా కూరగాయల వ్యాపారం జరుగుతోంది. ఈ మార్కెట్ కు మహబూబాబాద్, తొర్రూరు, వైరా, మధిర, పాలేరు, సూర్యాపేట, కొత్తగూడెం లాంటి పట్టణాల నుంచి కూడా వ్యాపారులు వచ్చి హోల్ సేల్ గా కూరగాయలు తీసుకెళుతుంటారు. ఖమ్మం నగరంలోనూ తోపుడు బండ్లు, షెటర్లు పెట్టుకొని అమ్ముకునేవారు కూడా ఇక్కడే కొంటుంటారు. ఇలా రోజుకు రూ.50 లక్షల నుంచి 60 లక్షల వరకు వ్యాపారం జరుగుతుందని అంచనా. అయితే సందర్భం ఏదైనా లైసెన్స్‌దారులంతా ఒక్కటై మార్కెటింగ్ రూల్స్ కు విరుద్ధంగా వేలం నిర్వహిస్తున్నారు. ఇది ఆరునెలలుగా సాగుతోంది. సుమారు రూ.4 లక్షల నుంచి 5 లక్షల వరకు వేలం పాడి ఒక్కరోజు వ్యాపారాన్ని దక్కించుకుంటున్నారు. ఆర్నెళ్లలో ఇలా వేలం ద్వారా ఖర్చులు పోను రూ.50 లక్షల వరకు జమ చేసినట్టు సమాచారం. మార్కెట్ లో అసోసియేషన్ కమిటీగా ఏర్పడిన వ్యాపారులు ఈ వేలంలో వచ్చిన డబ్బుల్లో ఆఫీసర్లకు, మార్కెట్ కమిటీ పాలకవర్గానికి మామూళ్లు ఇస్తూ అందర్ని మేనేజ్ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
గోవా టూర్స్, చవితి ఉత్సవాలు, దావత్ లు...
ఇటీవల గోవా టూర్ కోసం ఒకసారి, వినాయక చవితి ఉత్సవాల ఖర్చుల కోసం అంటూ మరోసారి, దావత్ చేసుకోవాలన్నా, ఏదైనా పెళ్లికి వెళ్లాలన్నా, ఇతర ఖర్చులున్నా... వేలం నిర్వహించడం కామన్ గా మారింది. రెండేండ్ల కింద అమావాస్య పాట పేరుతో ఇలాగే వేలం నిర్వహిస్తుండగా, అప్పటి కలెక్టర్ఆఫీసర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో అప్పటి నుంచి సైలెంట్ గా ఉన్న వ్యాపారులు, ఆ కలెక్టర్ బదిలీ కావడంతో మళ్లీ దందా మొదలుపెట్టారు. రెగ్యులర్‌గా మార్కెట్లో జీరో దందా, తీసుకువచ్చిన సరుకును తక్కువగా చూపించి మార్కెటింగ్ శాఖకు చెల్లించాల్సిన సెస్‌ను ఎగ్గొట్టడం, రైతుల నుంచి ఎక్కువ కమీషన్ తీసుకోవడం వంటి ఇతర ఆరోపణలు ఉండనే ఉన్నాయి. మార్కెట్ నుంచి కూరగాయలతో బయటకు వెళ్లే ఆటోలు, జీపుల నుంచి ఎలాంటి రశీదులు ఇవ్వకుండా కింది స్థాయి సిబ్బందితో డబ్బులు వసూలు చేయించడం లాంటి వ్యవహారాలు కామన్‌గానే జరుగుతున్నాయి. ఇవి కాకుండా ఒకరోజు మొత్తం మార్కెట్ ను వేలం పాడిన వారికి తాకట్టు పెట్టే కొత్త దందాపై అటు మార్కెటింగ్ శాఖ సిబ్బంది గానీ, మార్కెట్ కమిటీ పాలకవర్గం గానీ సీరియస్ గా స్పందించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
లైసెన్స్‌రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చాం..
వేలం పాటల విషయం ఇటీవల మా దృష్టికి వచ్చింది. జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారితో కలిసి, అసోసియేషన్ సభ్యులతో సమావేశమై మాట్లాడాం. తోటి కమిషన్ దారులు ఎవరైనా చనిపోయినప్పుడు ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేయడం కోసం ఒకటి రెండు సార్లు ఇలా జరిగిందని సభ్యులు మాకు చెప్పారు. మరోసారి ఇలా చేస్తే లైసెన్సులు రద్దు చేస్తామని వాళ్లకు వార్నింగ్ ఇచ్చాము.
- రుద్రాక్షల మల్లేశం,
మార్కెట్ కమిటీ సెక్రటరీ, ఖమ్మం