
నాగర్ కర్నూల్, వెలుగు: కాళ్లకు చెప్పుల్లేకుండా, తలపై ఇరుముడితో రాళ్లు, రప్పలు, కొండ, కోనలు దాటుకుంటూ శ్రీశైలం వెళ్తున్న శివస్వాములకు ఊహించని ఆటంకాలు ఎదురవుతున్నాయి. కనీసం తాగునీరు, భోజనం, మెడికల్ క్యాంప్, నైట్ షెల్టర్ లాంటి సౌకర్యాలకు కల్పించని సర్కారు.. ఫారెస్ట్ రూల్స్ పేరిట ఇబ్బంది పెడుతోంది. పశ్చిమం, దక్షిణం వైపు ఉన్న మార్గాల గుండా పాదయాత్రగా వస్తున్న స్వాములకు అడవిలోకి అనుమతి లేదని, ప్రధాన రోడ్డు మీదుగా వస్తే సాయంత్రం 6 గంటల లోగా గమ్యాన్ని చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలని ఫారెస్ట్ అధికారులు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. కొల్లాపూర్ రేంజ్‌లో పులుల సంచారం పెరిగిందని, ఇప్పటికే మూడింటి పాదముద్రలు గుర్తించామని ప్రకటించి.. ఆ ప్రాంతంలో కాలినడక నిషేధించారు. దీంతో ప్రధాన, ఘాట్ రోడ్డు పక్క నుంచి వెళ్తున్నారు. కాగా, ఘాట్ రోడ్డు పక్కన ఫైర్ సేప్టీ కోసం ట్రెంచ్ కొట్టడంతో ఇటు స్వాములు, అటు వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.
రెండు మార్గాలు
శివస్వాములు హైదరాబాద్–శ్రీశైలం హైవేపై కాకుండా దూరం తక్కువగా ఉండే నల్లమల అటవీ ప్రాంతంలోని మట్టిరోడ్ల ద్వారా శ్రీశైలం చేరుకుంటారు. దక్షిణం వైపు కర్నూల్, గద్వాల, అలంపూర్, వనపర్తి, కొల్లాపూర్ ఏరియాల నుంచి వచ్చే శివస్వాములు కొల్లాపూర్, మారెడుదిన్నె, యాపట్ల, లింగాల, బల్మూరు, ఉమామహేశ్వరం మీదుగా మన్ననూర్‌కు చేరుకుంటారు. పశ్చిమం వైపు హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, తాండూరు, మహబూబ్‌నగర్ ఏరియాల నుంచి వస్తున్న శివస్వాములు బొల్గట్‌పల్లి, ఉమామహేశ్వరం వెనుక నుంచి మన్ననూర్‌కు చేరుకుంటారు. మూడు కిలోమీటర్లు మెయిన్ రోడ్డుపై నడిచిన తర్వాత దాదాపు 35 కి.మీ.లు అడవిబాటలో వటవర్లపల్లికి, అక్కడి నుంచి ఘాట్‌రోడ్డుపై శ్రీశైలం వెళ్తారు.
40 కి.మీ. అదనం
దక్షిణం వైపు నుంచి వచ్చే భక్తులు రెండేళ్ల కింద వరకు లింగాల నుంచి అప్పాయిపల్లి, గుర్జగుండాలు, సలేశ్వరం, భౌరాపురం, మెడిమల్కాల, సంగిడి గుండాల, పాతాళ గంగ మీదుగా శ్రీశైలం వెళ్లేవారు. ఈ మార్గంలో లింగాల నుంచి శ్రీశైలం వరకు 60 కి.మీ. దూరం ఉంటుంది. పులుల సంచారం పెరగడంతో రెండేండ్లుగా అధికారులు అనుమతించడం లేదు. దీంతో మారెడుదిన్నె, బల్మూరు, ఉమామహేశ్వరం మీదుగా దాదాపు 90 కిలోమీటర్లు నడిచి మన్ననూర్‌కు వెళ్తున్నారు. ఈ మార్గంలోనూ నాలుగు రోజుల కింద పులుల పాదముద్రలు గుర్తించడంతో తొవ్వ బంద్ పెట్టారు. దీంతో కొల్లాపూర్, -నాగర్ కర్నూల్-, అచ్చంపేట ప్రధాన రోడ్డు మీదుగా 130 కి.మీ. నడిచి మన్ననూర్‌కు చేరుకుంటున్నారు. అంటే 40 కి.మీ. దూరం ఎక్కువ అవుతోంది.
కనీస సౌకర్యాలు కరువు
నల్లమలలో యావరేజీగా 100 కిలోమీటర్లకు పైగా నడుస్తూ శ్రీశైలం వెళ్తున్న భక్తులకు ఫారెస్ట్, పోలీసు, ఐటీడీఏ, వైద్యారోగ్య శాఖ అధికారులు ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదు. తాగునీరు, భోజనం, రాత్రి బస చేసేందుకు షెల్టర్, అనారోగ్యం, గాయాలైతే ట్రీట్‌మెంట్ చేసేందుకు మెడికల్ క్యాంపులు కూడా పెట్టడం లేదు. ఒకటిరెండు స్వచ్ఛంద సంస్థలు మినహా ఎవరూ పట్టించుకోవడం లేదు. కనీసం చెక్‌పోస్టు నిబంధనల్లో సడలింపు కూడా ఇవ్వడం లేదు. ఏపీ వైపున్న చెక్‌పోస్టుల్లో టోల్ వసూలు చేయొద్దంటూ ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు.
పులుల పాదముద్రలు గుర్తించినం
కొల్లాపూర్ రేంజ్ పరిధిలోని జాలిపెంట, శూలాలపెంట, మినిముట్, అంకిల్ పెంట ఏరియాలో రెండు ఆడ పులులు, ఒక మగ పులి సంచరిస్తున్నట్లు కెమెరా ద్వారా గుర్తించినం. వీటితో పాటు చిరుతపులి, ఎలుగుబంటి సంచారాన్ని గుర్తించినం. పెద్దూటి సమీపంలో ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాల్లో ఇవి రికార్డ్ అయ్యాయి. అందుకే ఈ ప్రాంతంలో శివస్వాముల పాదయాత్రను నిషేధించినం.
–శరత్ చంద్రారెడ్డి, కొల్లాపూర్ రేంజర్
అడవిలోకి అనుమతి లేదు
సమ్మర్ మొదలవుతుండడంతో అడవి జంతువులు రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే అడవిలో ఎవరినీ అనుమతించడం లేదు. శ్రీశైలం వెళ్లే భక్తులు ప్రధాన రోడ్డు మార్గం గుండా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోవాలి. కాలినడకన వెళ్లే శివస్వాములు సాయంత్రం 6 గంటలలోపు గమ్యం చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలి. అడవిలో నిప్పు పెట్టి వంటలు చేసినా, ప్లాస్టిక్ వస్తువులు పారవేసినా చర్యలు తప్పవు.
–రోహిత్ గోపిడి, డీఎఫ్‌వో