53 కేజీల బంగారం తుప్పు పట్టేస్తుంది.. మా నగలు మాకిచ్చేయండి

53 కేజీల బంగారం తుప్పు పట్టేస్తుంది.. మా నగలు మాకిచ్చేయండి

హైదరాబాద్: కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఓఎంసీ కేసులో తన ఇంట్లో ఉన్న 53 కిలోల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారని, ఆ నగలు తుప్పుపట్టిపోతాయని గాలి జనార్ధన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆ 53 కిలోల నగలతో పాటు రూ.5 కోట్ల విలువైన బాండ్లను తనకు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణలో హైకోర్టులో గాలి జనార్ధన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది.

మైనింగ్లో అక్రమాలకు పాల్పడి 884 కోట్లకు పైగా ప్రజా ధనాన్ని దోచుకున్నారని సీబీఐ కేసు నమోదు చేసిందని, ఆర్థిక నేరానికి పాల్పడి కొన్న నగలపై ఈడీ కూడా హక్కులు కోరుతుందని తెలంగాణ హైకోర్టు పిటిషనర్కు తెలిపింది. అందువల్ల.. సీజ్ చేసిన బంగారాన్ని, ఇతర బాండ్లను అప్పగించాలని ఉత్తర్వులు ఇవ్వలేమని పిటిషనర్లు అయిన గాలి జనార్ధన్ రెడ్డికి, ఆయన కుమార్తె బ్రాహ్మణికి, కుమారుడు కిరీటికి.. జస్టిస్ కె.లక్ష్మణ్ స్పష్టం చేశారు.

ALSO READ | 24క్యారెట్ల గోల్డ్ స్వీట్స్ ఎప్పుడైనా చూశారా.. కేజీ రూ. 50వేలు

కేసులో విచారణ పూర్తయ్యే వరకూ ఆ 53 కేజీల బంగారాన్ని, 5 కోట్ల విలువైన బాండ్లను పిటిషనర్కు అప్పగించాలని ఆదేశాలు ఇవ్వలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ బంగారు నగలను సెప్టెంబర్ 5, 2011న గాలి జనార్ధన్ రెడ్డి నివాసంలో సీబీఐ సోదాలు జరిపి సీజ్ చేసింది. ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన 885 కోట్ల రూపాయల ఆస్తులను, బ్రాహ్మణి కంపెనీ షేర్లతో సహా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఇప్పటికే సీజ్ చేసిన సంగతి తెలిసిందే.